ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు: వైఎస్ జగన్

By narsimha lodeFirst Published Jul 1, 2020, 12:00 PM IST
Highlights

త్వరలో రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో  నాట్కో క్యాన్సర్ బ్లాక్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.


గుంటూరు: త్వరలో రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో  నాట్కో క్యాన్సర్ బ్లాక్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

రూ. 50 కోట్లతో  నాట్కో క్యాన్సర్ బ్లాక్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం, నాట్కో ట్రస్టుల ఆధ్వర్యంలో ఈ బ్లాక్ ఏర్పాటు చేశారు.డాక్టర్స్ డే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో  రానున్న రోజుల్లో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్టుగా సీఎం చెప్పారు. కర్నూల్ లో కూడ ఇదే రకమైన విభాగాన్ని ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. 

ఇవాళ రాష్ట్రంలో  108, 104 అంబులెన్స్ లను 1088 ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అంబులెన్స్ లలో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.

పసిపిల్లలకు కూడ ప్రతి జిల్లాలో రెండు అంబులెన్స్ లను కేటాయించామన్నారు. గత ప్రభుత్వంలో 108 అంబులెన్స్ లు అరకొరగా ఉండేవి. 104 అసలు కన్పించకపోయేవని సీఎం చెప్పారు. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు కూడ ఫోన్ చేసిన 20 నిమిషాలలోపుగానే అంబులెన్స్ లు ప్రజల వద్దకు చేరుకొంటాయని చెప్పారు. 

ప్రతి ఐదు లేదా ఏడు గ్రామాలకు ఒక డాక్టర్ ను కేటాయిస్తామన్నారు. డాక్టర్లు తమకు కేటాయించిన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు నేడు పథకం కింద మెరుగైన సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆరోగ్యశ్రీ బకాయిలను ఆసుపత్రులకు మూడు వారాల్లో ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన తెలిపారు. పేదలకు ఆరోగ్య శ్రీ సేవలు అందేలా చూస్తున్నామన్నారు. ఆపరేషన్ చేసుకొన్న ప్రతి ఒక్క రోగికి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ. 5వేలను ప్రభుత్వం అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

ఆరోగ్య శ్రీ పథకం కింద 2059 రోగాలను చేర్చినట్టుగా ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు.

click me!