పోలవరంపై తెలంగాణ అనుమానాలు నివృత్తి చేస్తాం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

By narsimha lodeFirst Published Sep 18, 2022, 11:23 AM IST
Highlights

పోలవరం ప్రాజెకటుపై తెలంగాణ అనుమానాలను నివృత్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు  ఈ విషయాన్ని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు గతంలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 
 

అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అనుమానాలను నివృత్తి చేస్తామని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

ఆదివారం నాడు ఏపీ మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయమై తెలంగాణ నేతలు కొత్త వాదన ఎందుకు తెస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. గతంలో తెలంగాణ నేతలు సుప్రీంకోర్టులో పోలవరంపై పిటిషన్ దాఖలు చేశారన్నారు.  రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఈ విషయాన్ని కూర్చొని చర్చించుకోవాలని  సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  పోలవరం పై తెలంగాణ  ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన చెప్పారు.

ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వరద పోటెత్తింది.ఈ వరద కారణంగా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భద్రాచలం వద్ద గోదావరి 71 అడుగులు దాటి ప్రవహించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే ఈ పరిస్థితి నెలకొందని  తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఏపీలోని విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి వరద నీరు భద్రాచలం పట్టణంలోని ప్రవహించకుండా గతంలో నిర్మించిన కరకట్ట అడ్డుకుంది. దీంతో ఏపీలో విలీనమైన ఐదు గ్రామాల గుండా కరకట్ట నిర్మిస్తే భవిష్యత్తులో వరదలు వచ్చిన గ్రామాల్లోకి వరద నీరు రాకుండా అడ్డుకొనే  అవకాశం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో కరకట్ట నిర్మాణం కోసం అవసరమైతే ఏపీ ప్రభుత్వం చర్చిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో విలీనమై ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపితే ప్రయోజనమని తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. విలీన మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు కూడ జూలై మాసంలో ఆందోళనలు నిర్వహించారు. తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు నిర్వహించారు. అంతేకాదు ఈ గ్రామాల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా చేశారు. 

పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం ముంపునకు గురైందని తెలంగాణకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఆరోపణలను ఏపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఖండించారు.  రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఈ రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు విమర్శలు చేశారు.

 


 

click me!