ఉప ఎన్నికలకు సిద్ధపడే రాజీనామాలు: వైవీ సుబ్బారెడ్డి

First Published May 29, 2018, 12:17 PM IST
Highlights

ఉప ఎన్నికలకు సిద్ధపడే తాము రాజీనామా చేశామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

న్యూఢిల్లీ: ఉప ఎన్నికలకు సిద్ధపడే తాము రాజీనామా చేశామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపు మేరకు ఆమెను కలిసి తమ రాజీనామాలపై మాట్లాడేందుకు వైసిపి లోకసభ సభ్యులు ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ ను పట్టుబడుతామని, తాము స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖలు సమర్పించామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం తాము రాజీినామాలు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజీనామాలు చేసినట్లు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ నాలుగేళ్లు బిజెపితో కాపురం చేసిందని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము 13 సార్లు అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చామని చెప్పారు.

ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. తాము నిజాయితీగా, చిత్తశుద్ధితో, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని అన్నారు. టీడీపి లాగా తాము డ్రామాలు ఆడడం లేదని, వైఖరి మార్చుకోవడం లేదని అన్నారు. కర్ణాటకలో ఇద్దరు ఎంపీల రాజీనామాలను ఆమోదించినప్పుడు తమ రాజీనామాలను ఎందుకు ఆమోదించరని అడుగుతామని అన్నారు. శాసనసభకు ఎన్నికైన యడ్యూరప్ప, బి. శ్రీరాములు రాజీనామాలను స్పీకర్ వెంటనే ఆమోదించిన విషయం తెలిసిందే.

click me!