జగన్ వ్యక్తిత్వంపై...ఉండవల్లి కామెంట్స్

First Published Jan 23, 2018, 3:30 PM IST
Highlights
  • ‘అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను ప్రజలు దేవుడిలాగ చూస్తున్నారు’

‘అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను ప్రజలు దేవుడిలాగ చూస్తున్నారు’..ఇవి తాజాగా మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అనిపించుకున్నారు కాబట్టే వైఎస్ ను జనాలు దేవుడిలా కొలుస్తున్నారంటూ చెప్పారు. పేదలకు వైద్యం, విద్య, పింఛన్, రేషన్ కార్డులు, ఇళ్ళు లాంటివి అందించిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా జనాలు అదే అభిప్రాయంతో ఉన్నట్లు ఉండవల్లి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడితే జనాలు ఆధరిస్తారని లేకపోతే లేదన్నారు. ఇప్పటి వరకూ జగన్ గురించి ఏమీ తెలీదు కాబట్టి తండ్రి లాగే ఇచ్చినమాటకు కట్టుబడి ఉంటారనే అనుకోవాలని మాజీ ఎంపి చెప్పారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదన్నారు.

పనిలో పనిగా చంద్రబాబు గురించి కూడా మాట్లాడుతూ, సీఎం మాటలకు, లెక్కలకు పొంతన కనిపించటంలేదని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కాకిలెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు జీడీపీ పెంచామని చెబుతూనే ఇంకోవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పటంలో అర్ధం లేదన్నారు.

రాష్ట్రానికి న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్రం మీద కాకుండా ఎవరిపై కోర్టుకు వెళతారని నిలదీసారు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చుని ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకని  నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ అనడం దారుణమన్నారు.

హైదరాబాద్‌ నుంచి ఐటీ కంపెనీలు కోస్తాకు ఎందుకు వస్తాయని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీలన్నీ బెంగళూరు, హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. హెరిటేజ్‌ ఫ్రెష్‌ ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉందని, తెలంగాణకు పన్ను చెల్లిస్తోందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు మాత్రమే తన కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారని, హైదరాబాద్‌ను వదిలిపెట్టి ఎవరూ రావడం లేదన్నారు. సినిమావాళ్లు అక్కడే ఉన్నారని ఉండవల్లి గుర్తుచేశారు.  

 

 

click me!