చంద్రబాబు-జగన్.. ఎత్తుకు పై ఎత్తులు

First Published Jan 23, 2018, 1:55 PM IST
Highlights
  • రాజకీయాలన్నాక ఎత్తులు, పై ఎత్తులు తప్పవు కదా?

రాజకీయాలన్నాక ఎత్తులు, పై ఎత్తులు తప్పవు కదా? అది గ్రామస్ధాయిలో సర్పంచ్ పదవి కోసం కావచ్చు లేదా ముఖ్యమంత్రి పదవి కోసమూ కావచ్చు. ఎత్తుల్లో, పై ఎత్తుల్లో ఎవరిది పై చేయి అయితే వారిదే విజయం. ఇదంతా ఇపుడెందుకంటే, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తులు, పై ఎత్తులు మొదలుపెట్టేసారు. రాజకీయాల్లో అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ లక్ష్యాన్ని అందుకోవటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి. అందులో సామాజికవర్గాల మద్దతు కూడగట్టుకోవటం కూడా ఒకటి.

ఇపుడా అంశంపైనే టిడిపి అధినేత చంద్రదబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి బాగా దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ శిధిలమైపోయిన తర్వాత అందులోని ప్రముఖ రెడ్డి కుటుంబాలు దాదాపు వైసిపి వైపు వెళ్ళిపోయారు. అందుకే పోయిన ఎన్నికల్లో వైసిపికి రాయలసీమలో అంత పట్టుదొరికింది. మిగిలిన కొందరిని వచ్చే ఎన్నికల్లోగా తనవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. దాని ద్వారా రాయలసీమలో జగన్ ను దెబ్బతీయాలన్నది చంద్రబాబు వ్యూహం.

అదే సమయంలో జగన్ కూడా చంద్రబాబును దెబ్బకొట్టటానికి పై ఎత్తులు వేస్తున్నారు. ఇంతకీ జగన్ వేస్తున్న పై ఎత్తులేంటంటే, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలను వైసిపిలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇపుడు పార్టీలో ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, విజ్ఞాన్ సంస్ధల అధినేత  లావు రత్తయ్య కొడుకు శ్రీకృష్ణదేవరాయులు, ప్రత్తిపాడు మాజీ ఎంఎల్ఏ రావి వెంకటరమణ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రముఖులు. మొన్ననే విజయవాడకు చెందిన యువనేత జెఎస్వీ చౌదరి వైసిపిలో చేరారు. త్వరలో యలమంచలి రవి పార్టీలోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వైసిపిలో ఉన్న కమ్మ నేతల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.

కృష్ణా, గుంటూరు జిల్లాలు రాజధాని జిల్లాలైపోయాయి. ఆ జిల్లాపై కమ్మ సామాజికవర్గం ఆధిపత్యమేంటో అందరికీ తెలిసిందే. ఇక్కడ జనాభాతో నిమ్మితం లేకుండా రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యం మాత్రం కమ్మ వారిదే. మరి, అంతటి కీలకమైన జిల్లాల్లో కమ్మవారి మద్దతు లేకుండా రాజకీయం చేయటం సాధ్యం కాదు. కాబట్టి వీలైనంత ఎక్కువమంది కమ్మోరిని వైసిపిలోకి చేర్చుకోవాలన్నది జగన్ వ్యూహం.

అందుకే ఆ బాధ్యతను ఆదిశేషగిరిరావు లాంటి వారికి అప్పగించారట. వైసిపిలో చేరేందుకు ఇప్పటికే కొన్ని కమ్మ ప్రముఖ కుటుంబాలు సానుకూలంగా స్పందించాయట. అయితే, ఎన్నికల ముందు వరకూ బహిరంగంగా రాలేమని చెప్పాయని సమాచారం. అంటే చంద్రబాబు రెడ్లను ఆకర్షించేందుకు ఎత్తులేస్తుంటే, జగన్ కమ్మవారిని ఆకర్షించేందుకు పై ఎత్తలేస్తున్నారు. ఎవరి వ్యూహం వర్కవుటవుతుందో చూడాల్సిందే.

click me!