
శ్వేతపై ఎలాంటి దాడి జరగలేదన్నారు విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిని ఆత్మహత్యగానే నిర్ధారించామన్నారు. మృతదేహం అక్కడి వరకు ఎలా వచ్చిందన్న దానిపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒషినోగ్రఫీని సంప్రదించామని.. వారిచ్చిన సలహా మేరకు తమకు కొంత అవగాహన వచ్చిందన్నారు. ఈ కేసులో త్వరలోనే ఛార్జ్‌ఫీట్ దాఖలు చేస్తామన్నారు సీపీ. శ్వేత అత్తమామలపై వరకట్నం కేసు.. శ్వేత ఆడపడచు భర్త సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని సీపీ పేర్కొన్నారు.
శ్వేతపై వేధింపులు నిజమేనని త్రివిక్రమ్ వర్మ తెలిపారు. శ్వేత తల్లి ఎదుటే దంపతులిద్దరూ గొడవ పడ్డానని.. అనంతరం శ్వేత కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారని సీపీ వెల్లడించారు. ఆ కాసేపటికే బీచ్ దగ్గర మృతదేహం వుందని సమాచారం వచ్చిందని త్రివిక్రమ్ తెలిపారు. సెల్‌ఫోన్, సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. గృహ, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అత్త, మామ చిన్న చూపు చూడటంతో శ్వేత మనస్థాపానికి గురైందని సీపీ తెలిపారు. శ్వేత భర్త కొద్దిరోజుల క్రితం ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌కు వెళ్లాడని ఆయన చెప్పారు. శ్వేత పేరు మీద 90 సెంట్ల భూమి వుందని.. దానిని తన పేరు మీదకి మార్చాలని భర్త మణికంఠ ఇబ్బంది పెట్టాడని సీపీ తెలిపారు.
అంతకుముందు ఈ కేసును దిశా పోలీసులకు అప్పగించారు విశాఖ న్యూపోర్ట్ పోలీసులు. నిందితులను ఇవాళ రిమాండ్‌లోకి తీసుకోబోతున్నారు దిశా పోలీసులు. శ్వేత మిస్టరీ మృతి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఆమె ఆడపడుచు భర్త సత్యం వాట్సాప్ చాట్ కీలకం కాబోతోంది. సత్యంపై ఆరోపణలు రాగానే.. తన ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేశాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పినా శ్వేతతోనే క్షమాపణలు చెప్పించారని రమాదేవి ఆరోపించారు.