Viveka Case: వివేకా హత్య కేసు విచారణ వాయిదా.. వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదల

By Mahesh K  |  First Published Sep 22, 2023, 1:22 PM IST

వివేకా హత్య కేసును ఈ రోజు విచారించి సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు వివేకా హత్య కేసు నిందితులు ఎంపీ అవినాశ్ రెడ్డి, ఇతర నిందితులు హాజరయ్యారు. కాగా, ఇదే కేసులో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ రోజు చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.
 


అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఈ విచారణ జరగ్గా.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహా మిగిలిన నిందితులు హాజరయ్యారు. ఈ కేసు విచారించిన సీబీఐ కోర్టు విచారణను అక్టోబర్ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయడంతో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.

సీబీఐ కోర్టు 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయడంతో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ రోజు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నారని చంచల్ గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం ఈ బెయిల్ మంజూరైంది.

Latest Videos

Also Read: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కా‌మ్‌కి బాబే కారణం: ఏపీ అసెంబ్లీలో పేర్నినాని

ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు కొన్ని షరతులు విధించింది. వైఎస్ భాస్కర్ రెడ్డి హైదరాబాద్‌లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లరాదని స్పష్టం చేసింది. వచ్చే నెల 3వ తేదీన వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనను గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు.

click me!