
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద గత నెల 15వ తేదీన చోటుచేసుకున్న పరిణామాలను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఆ రోజు సాయంత్రం విశాఖ గర్జన సభ ముగించుకుని వెళ్తున్న మంత్రులు, వైసీపీ నాయకులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అదే సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తుండటంతో.. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న జనసేన శ్రేణుల్లో కొందరు ఈ దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వంద మందికి పైగా జనసేన నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా ఆ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ వెస్ట్ డివిజన్ ఏసీపీ టేకు మోహనరావు, అప్పటి ఎయిర్‌పోర్ట్ సీఐ ఉమాకాంత్‌లను నగర పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ సస్పెండ్ చేశారు. మంత్రులపై దాడి జరిగిన సమయంలో బందోబస్తు కల్పించడంలో, పవన్ కల్యాన్ పర్యటనలో విధుల నిర్వహణలో విఫలమైన కారణంగా వారిపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేసినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గత నెల 15వ విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహించారు. ఈ సభకు హాజరైన పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు తిరిగి వెళ్లేందుకు.. సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నంకు వస్తున్న పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు భారీగా జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు, మంత్రులుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు వంద మందికి పైగా జనసేన నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.