కోరమండల్ కర్మాగారం నుంచి విషవాయువులు.. జనం ఆందోళన

By Siva KodatiFirst Published Oct 14, 2020, 3:42 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ తరహా ఘటన మరొకటి జరగకముందే కోరమండల్ సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ తరహా ఘటన మరొకటి జరగకముందే కోరమండల్ సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టాలని విశాఖ పారిశ్రామిక వాడకు సమీపంలోని కుంచుమాంబ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 

సోమవారం సాయంత్రం కోరమండల్ కర్మాగారం నుండి వెలువడిన విషవాయువు కారణంగా ఇబ్బందులు పడి పిలకవాని పాలెం,కుంచుమాంబ కాలనీ వాసులు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం, కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నేత కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలసి బుధవారం కాలనీ వద్ద ఆందోళన చేపట్టారు. తక్షణమే కోరమండల్ ఎరువుల కర్మాగారాన్ని జనావాసాల మధ్య నుండి తరలించాలంటూ వారు నినాదాలు చేశారు.

సుమారు 1000కి పైగా ప్రజలు నివసిస్తున్న తమ గ్రామంలో కోరమండల్ సంస్థ కాలుష్యం కారణంగా చిన్నారుల నుండి పెద్దవారు వరకు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వైపు భారీ వర్షం కారణంగా ఇళ్లల్లో ఉన్నటువంటి వారు నిన్న సాయంత్రం కోరమండల్ నుండి వెలువడిన విషవాయువు కారణంగా ఆనారోగ్యం పాలయ్యారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి కోరమండల్ సంస్థపై చర్యలు తీసుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

click me!