నిమ్మగడ్డ తీరుకు నిరసన.. ఎన్నికలు బహిష్కరించిన కంపసముద్రం

By AN TeluguFirst Published Feb 9, 2021, 9:53 AM IST
Highlights

నెల్లూరు జిల్లాలో ఓ పల్లె ఎన్నికలను బహిష్కరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార తీరుకు నిరసనగానే కలిసికట్టుగా ఆ గ్రామం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో మా ఊళ్లో ఎన్నికలే జరగనివ్వబోమంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించారు. సోమవారం నామినేషన్లన్నింటినీ ఉపసంహరించుకున్నారు. 

నెల్లూరు జిల్లాలో ఓ పల్లె ఎన్నికలను బహిష్కరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార తీరుకు నిరసనగానే కలిసికట్టుగా ఆ గ్రామం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో మా ఊళ్లో ఎన్నికలే జరగనివ్వబోమంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించారు. సోమవారం నామినేషన్లన్నింటినీ ఉపసంహరించుకున్నారు. 

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే ఆ మండల అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఏకగ్రీవాలను రద్దు చేస్తామన్న ప్రకటనలపై ఆ గ్రామస్తులు తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేశారు. 

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కంపసముద్రం పంచాయతీ ప్రజలు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వ్యవహార తీరును నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసుకున్నారు. 2,500 మందికి పైగా జనాభా ఉన్న ఈ పంచాయతీలో 1,780 మంది ఓటర్లున్నారు. 

ఈ గ్రామంలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. రాజకీయ పరిణితి ఎక్కువ. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈనెల 13న ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్‌ పదవి కోసం 8 మంది, పది వార్డులకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని గ్రామాభివృద్ధికి ఐక్యంగా నడవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. 

అయితే, ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఏకగ్రీవాలను రద్దుచేస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ చేసిన ప్రకటన వారిని ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది. ఊరంతా ఓకే మాట, ఒకే బాటగా ఉండి ఏకగ్రీవమైనా.. ఎన్నికను రద్దుచేస్తే తమ మాటకు విలువ ఉండదని భావించారు. దీంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

అంతేకాదు, నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. సర్పంచ్, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

ఇక్కడ ఏకగ్రీవాలు కొత్త కాదు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. మల్లు రామిరెడ్డి, నారపరెడ్డి ఓబుల్‌రెడ్డి, పుట్టం సీతారామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషిచేశారు. 

దీనిమీద గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామమంతా ఏకమై ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రతిపక్ష పార్టీకి తొత్తులా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకగ్రీవాలను రద్దుచేస్తామనటం మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే నిమ్మగడ్డ ఉన్నంతకాలం ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని మల్లు సుధాకర్‌రెడ్డి అనే గ్రామస్తుడు తెలిపారు. 

గ్రామస్తులందరూ కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంతో వేసిన నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నాం. సర్పంచ్‌ పదవి బీసీలకు కేటాయించారు. 8 మందిమి నామినేషన్లు వేశాం. నిమ్మగడ్డ మాటతో అందరం విత్‌డ్రా చేసుకున్నామని చెవుల రమేష్ అన్నారు. 

ఊరంతా కలిసి తీసుకునే నిర్ణయానికి విలువ లేనప్పుడు ఎన్నికలు ఎందుకు జరుపుకోవాలి? అందుకే నిమ్మగడ్డ పదవిలో ఉన్నంతకాలం మేము ఎన్నికలకు దూరంగా ఉంటాం అని సన్నిబోయిన బాలకృష్ణ నిరసన తెలిపారు. 
 

click me!