వృద్దుల పించన్ డబ్బులతో జూదమాడి... అడ్డంగా బుక్కయిన వాలంటీర్

Published : Aug 03, 2023, 10:17 AM ISTUpdated : Aug 03, 2023, 10:21 AM IST
వృద్దుల పించన్ డబ్బులతో జూదమాడి... అడ్డంగా బుక్కయిన వాలంటీర్

సారాంశం

వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పంచాల్సిన పెన్షన్ డబ్బులను జూదంలో పోగొట్టాడు ఓ వాలంటీర్. ఈ వ్యవహాారం బయటపడకుండా కట్టుకథ అల్లి అడ్డంగా బుక్కయ్యాడు. 

అనంతపురం : జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేసింది మొదలు వారి భాగోతాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే వాలంటీర్లు అమ్మాయిలను మోసం చేసిన, ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటనలు వెలుగుచూసాయి. తాజాగా వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు అందించే ఆసరా పెన్షన్ డబ్బులతో ఓ వాలంటీర్ జూదమాడిన వ్యవహారం బయటపడింది. పించన్ డబ్బులన్నీ పోగొట్టుకుని విషయం బయటికి రాకుండా కట్టుకథ అల్లాడు. కానీ పోలీసుల విచారణలో సదరు వాలంటీర్ జూదం గురించి బయటపడి అడ్డంగా దొరికిపోయాడు. 

అనంతపురం జిల్లా  విడపనకల్లు గ్రామ వాలంటీర్ ప్రతి నెలా మాదిరిగానే ఆగస్ట్ 1న వైఎస్సార్ ఆసరా పెన్షన్ డబ్బులను అధికారుల నుండి తీసుకున్నాడు. రూ.89 వేల నగదు తీసుకుని లబ్దిదారులకు పించన్లు ఇవ్వకుండా నేరుగా కర్నూల్ జిల్లా గుమ్మనూరుకు వెళ్లాడు వాలంటీర్. అక్కడ కొందరితో కలిసి పించన్ డబ్బులతో జూదమాడాడు. ఈ క్రమంలో పించన్ డబ్బులతో పాటు చేతికున్న బంగారు ఉంగరం, సెల్ ఫోన్ కూడా పోగొట్టుకున్నాడు.  

Read More  డబ్బులివ్వడానికి వెళ్లి.. వృద్దురాలిని హతమార్చిన వాలంటీర్..

జూదంలో పించన్ డబ్బులు పోగొట్టుకున్నట్లు బయటపడితే ఉద్యోగం పోతుందని భయపడిపోయాడు సదరు వాలంటీర్. దీంతో విషయం బయటపడకుండా కట్టుకథ అల్లాడు. పించన్ డబ్బులు తీసుకుని గ్రామానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు దారిదోపిడీకి పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేసాడు. తనను కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి తీసుకెళ్ళి బెదిరించారని... దీంతో పించన్ డబ్బులతో పాటు తన బంగారు ఉంగరం, సెల్ ఫోన్ వారికి ఇచ్చేసినట్లు వాలంటీర్ తెలిపాడు. ఈ మేరకు తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు కూడా చేసాడు.  

అయితే వాలంటీర్ వ్యవహారం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపారు. దీంతో వాలంటీర్ నిర్వాకం బయటపడింది. జూదంలో డబ్బులు పోగొట్టుకుని ఈ విషయం బయటకుండా నాటకాలు ఆడుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ వాలంటీర్ వ్యవహారం బయటకు పొక్కకుండా రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఈ వ్యవహారం జరిగి రెండు రోజులు అవుతున్నా వాలంటీర్ పై ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. వెంటనే వాలంటీర్ పై చర్యలు తీసుకుని పించన్ డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu