
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం (ఏపీ జూడా) బుధవారం రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేసింది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్-ఫైనాన్సింగ్ అడ్మిషన్ ఫీజు రూ. 12 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ సీట్ల అడ్మిషన్ ఫీజు రూ. 20 లక్షలుగా నిర్ణయించి వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనల చేపట్టాలని నిర్ణయించిన ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ మేరకు కార్యచరణను సిద్దం చేసింది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వడంతో పాటు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఆగస్టు 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని తెలిపింది.
ఇక, నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీన క్యాండిల్ ర్యాలీతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టనున్నారు. 5వ తేదీన కాలేజీల క్యాంపస్ నుంచి బయటకు వచ్చి శాంతియుత ర్యాలీలు నిర్వహించనున్నారు. 6న శాంతియుత నిరసనలతో పాటు మీడియా సమావేశాలు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు తెలిపారు.
2023-24 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందిస్తున్నాయి. ఒక్కో కాలేజీలో దాదాపు 150 సీట్లు ఉంటాయి. అయితే ఈ కాలేజీల్లో సీట్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో కూడా జారీ చేసింది. దీని ప్రకారం మొత్తం సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటాకు చెందినవి. 85 శాతం ఇతర సీట్లలో 50 శాతం సీట్లు జనరల్ కేటగిరీకి, 35 శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్‌కు, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కేటగిరీకి కేటాయించారు.
అంతేకాకుండా.. సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఎన్‌ఆర్‌ఐ కేటగిరీల కింద సేకరించిన మొత్తాన్ని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్‌లో జమ చేసి.. ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలలు, కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ సంస్థల అభివృద్ధికితృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలను పునరుద్ధరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనలను అందించడానికి వినియోగించాలని పేర్కొంది.
అయితే సీట్ల వర్గీకరణ వల్ల అర్హులైన విద్యార్థులకు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య తగ్గుతుందని.. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి రిజర్వ్‌డ్ కేటగిరీలకు కూడా విద్యార్థుల మధ్య ఆర్థిక అసమానత ఏర్పడుతుందని ఏపీ జూడా పేర్కొంది.
ఇదిలాఉంటే, మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీనియర్ అధికారులతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లను ఆహ్వానించింది. అయితే తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ సీట్లను వర్గీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.