బాబు టికెట్ ఇవ్వకపోతే ఏమీ కాదు, పార్టీలతో పనిలేదు: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలనం

By narsimha lodeFirst Published Jan 17, 2023, 9:55 AM IST
Highlights

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు  చేశారు. తాను  టికెట్ కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు.  చంద్రబాబు టికెట్టు ఇవ్వకపోతే ఏమీ కాదన్నారు. 
 

విజయవాడ: తాను టికెట్  కోసం పాకులాడే వ్యక్తిని కాదని విజయవాడ ఎంపీ కేశినేని చెప్పారు.  తనకు  చంద్రబాబునాయుడు  టికెట్  ఇవ్వకపోయినా  కూడా  ఏమీ కాదన్నారు.

విజయవాడలో   సోమవారం నాడు  రాత్రి  కేశినేని నాని మీడియాతో మాట్లాడారు.తనను పోటీ చేయాలని  ప్రజలు  కోరితే    పోటీ చేస్తానన్నారు. పోటీ చేయవద్దని ప్రజలు కోరుకుంటే   తాను   పోటీకి దూరంగా  ఉంటానని  కేశినేని నాని చెప్పారు. తనకు  పార్టీలతో పని లేదని ఆయన స్పష్టం  చేశారు. ప్రజలు కోరకుంటే  ఇండిపెండెంట్ గా గెలిపిస్తారేమోనని ఆయన  తెలిపారు. ఎన్నికల కోసం  పెట్టి తీసేసే ట్రస్టులు  తనవి కావన్నారు.  విజయవాడలో  అసాధ్యం  అనుకున్నది సాధ్యం  చేసి చూపించినట్టుగా  కేశినేని చెప్పారు. 

విజయవాడ ఎంపీగా  తాను రెండు దఫాలు విజయం సాధించినట్టుగా  చెప్పారు.  2014 నుండి  ఇప్పటివరకు  తాను  ఒక్క పైసా  అవినీతికి  పాల్పడలేదన్నారు. విజయవాడకు  కేంద్ర ప్రభుత్వం  నుండి, ట్రస్టుల నుండి  పెద్ద ఎత్తున  నిధులు తీసుకువచ్చినట్టుగా  నాని తెలిపారు.  తన  నియోజకవర్గంలో  రూ. 4 వేల కోట్లతో  264 గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా  కేశినేని నాని  తెలిపారు.

దానం చేసేవాడు తాను  చేసిన దానం గురించి ఎప్పుడూ చెప్పుకోడన్నారు.  రతన్ టాటా  తాను  చేస్తున్న  సేవల గురించి ఏనాడైనా మీడియా సమావేశం ఏర్పాటు  చేసి  చెప్పాడా అని  కేశినేని నాని ప్రశ్నించారు.    ఎన్నికల ముందు  ట్రస్ట్ లు  వస్తాయన్నారు. ఎన్నికలు అయిపోగానే   ట్రస్టులు  కన్పించకుండా  పోతాయన్నారు.  ట్రస్టుల పేరుతో  హడావుడి  చేస్తున్న వారికి  డబ్బులు ఎలా వచ్చాయో ఆరా తీయాలన్నారు. 

బస్ ట్రావెల్స్ లో  ఒకప్పుడు తాను కింగ్ నని చెప్పారు. ఈస్ట్ కోస్ట్ , వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ని ఏలినట్టుగా  కేశినేని నాని చెప్పారు.  ఒక అవినీతి అధికారి  అన్న మాటతో తాను బస్ ట్రావెల్స్  వ్యాపారాన్ని వదిలేసినట్టుగా  కేశినేని నాని  గుర్తు చేశారు.  ఆ అవినీతి అధికారి  హయంలో  జరిగిన  వాహనాల రిజిస్ట్రేషన్ ను అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లి  రద్దు చేయించినట్టుగా  నాని చెప్పారు. 

బీజేపీకి  వ్యతిరేకంగా  టీడీపీ స్టాండ్ తీసుకుందన్నారు. దీంతో నిండు సభలో  మోడీని వ్యతిరేకించినట్టుగా  కేశినేని నాని  గుర్తు చేశారు.  అయినా కూడా విజయవాడలో అభివృద్ది  కార్యక్రమాలు ఎక్కడైనా నిలిచిపోయాయా అని ఆయన ప్రశ్నించారు. 
 ఎంత దెబ్బతీస్తే  తన వ్యక్తిత్వం  అంతగా రాటు దేలుతుందన్నారు. తనను  ఎంత తగ్గించాలని చూస్తే తాను అంత ఎత్తుకు ఎదుగుతానని  కేశినేని నాని చెప్పారు.

also read:టీడీపీని ప్రక్షాళన చేయాలి, వారికి నా మద్దతుండదు: కేశినేని నాని సంచలనం

తాను  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని  ఎవరు చెప్పారని  మీడియాను  నాని ప్రశ్నించారు.  మీడియా తీరుపై  నాని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీడియా సంచలనం కోసం  తాపత్రయపడుతుందన్నారు.  మంచి పనులు చేసేవారిని మీడియా ఎందుకు ప్రోత్సహించదని ఆయన అడిగారు. విజయవాడ పార్లమెంట్  నియోజకవర్గంలో  ప్రజలకు  పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా  తన గురించి  ఎందుకు  రాయడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై  తాను  ఏనాడూ  కూడా మీడియాను అడగలేదన్నారు.  రతన్ టాటా ట్రస్టు ద్వారా తాను కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయమై  మీడియా ఏనాడైనా మాట్లాడిందా అని  ఆయన అడిగారు.  
 

click me!