దుర్గగుడిలో అన్యమత ఉద్యోగులు, కలకలం: డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఆదేశాలు

By Siva KodatiFirst Published Dec 5, 2019, 6:18 PM IST
Highlights

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో 5 శాతం మంది అన్యమస్థులున్నట్లు ఇంద్రకీలాద్రిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మాత మార్పిడులు, తిరుమలలో డిక్లరేషన్ వంటి వివాదాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. విజయవాడ పుష్కర ఘాట్ వద్ద 42 మందిని సామూహికంగా మత మార్పిడి చేశారనే వార్తలతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ క్రమంలో బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో 5 శాతం మంది అన్యమస్థులున్నట్లు ఇంద్రకీలాద్రిపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే నిబంధనల ప్రకారం హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించకూడదు... అయితే టీటీడీతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అన్యమతాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also read:టీటీడీలోని అన్య మతస్తులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి: సీఎస్

ఈ క్రమంలోనే అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఉద్యోగులందరి నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్వామి వారు లేదా అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నట్లు బహిరంగ ప్రమాణం చేయడం లేదా లిఖిత పూర్వకంగా రాసివ్వడాన్నే డిక్లరేషన్ అంటారు.

ఈ నేపథ్యంలో దుర్గమ్మ గుడిలో ఉన్న అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఆలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో అతనిని అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు.

దీంతో భయపడిన అన్యమత ఉద్యోగులు.. ఉద్యోగం పోతుందన్న భయంతో అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారు. అయితే వారి మత విశ్వాసాలు ఇప్పటికీ వేరుగా ఉన్నాయన్న వాదన కొండపై వినిపిస్తోంది.

ప్రస్తుతం దుర్గమ్మ సన్నిధిలో 890 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని దేవాదాయ శాఖ కమీషనర్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే దేవస్థానం అధికారులు ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

దీనిపై దుర్గగుడి ఈవో ఎంవి సురేశ్ బాబు స్పందిస్తూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఆదేశించినట్లుగా తెలిపారు.

Also read:జగన్ ఇంటికి కూతవేటు దూరంలో మత మార్పిడులు: జనసేన వీడియో ఇదే...

అన్యమత విశ్వాసాలతో ఉన్నవారు ఇంద్రకీలాద్రిపై ఉంటారని తాను అనుకోవడం లేదని, దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరీ నుంచి త్వరలోనే డిక్లరేషన్ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పున్నమి ఘాట్లో మత మార్పిడుల గురించి స్పందిస్తూ ఆ ఘటనతో దేవస్థానానికి సంబంధం లేదని సురేశ్ బాబు వెల్లడించారు. 

click me!