టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ మార్పుపై తేల్చేశారు. కొంత కాలంగా పార్టీ మారుతారని కరణం బలరాంపై ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒంగోలు: బెదిరిస్తే పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ లో ఈ మేరకు ఆయన పోస్టు పెట్టాడు.
ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ గాలం వేస్తోందని ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నానిలు చర్చలు జరిపారని ప్రచారం సాగింది.
టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు కూడ టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాలలోపుగానే టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్పించేలా వైసీపీ చీఫ్ జగన్ ప్లాన్ చేస్తున్నారని కథనాలు వచ్చాయి.
Also read:చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, వారు వీరే...
ఈ తరుణంలోనే కరణం బలరాం కూడ టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని కూడ కథనాలు వచ్చాయి.ఈ కథనాలపై కరణం బలరాం స్పందించారు. తన ఫేస్‌బుక్ లో ఈ మేరకు తన అభిప్రాయాలను ఆయన ప్రకటించారు.
బెదిరిస్తే తాను పార్టీ మారనని తేల్చి చెప్పారు. బెదిరింపులకు లొంగేది లేదన్నారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తనకు రాళ్ల వ్యాపారం లేదన్నారు. అంతేకాదు ఇసుక వ్యాపారం కూడ లేదని ఆయన చెప్పారు. పరోక్షంగా ఈ వ్యాఖ్యలు ఇదే జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే, తన ప్రత్యర్ధి గురించి చేసినవేననే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.కరణం బలరాం పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.