బెదిరించాలనే వెళ్తే.. చంపుకునేంత వరకు వెళ్లింది: బెజవాడ గ్యాంగ్‌వార్‌కు కారణం ఆ ‘‘ ఒక్కడే ’’

By Siva KodatiFirst Published Jun 8, 2020, 6:34 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌వార్‌లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌వార్‌లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించారు.

తాజాగా డీసీపీ హర్షవర్థన్ మీడియా ముందుకొచ్చారు. అంతేకాకుండా ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. సెటిల్‌మెంట్ విషయంలోనే పండు- సందీప్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని డీసీపీ స్పష్టం చేశారు.

Also Read:బెజవాడ గ్యాంగ్ వార్ లో కొత్త ముఖాలు: అజ్ఞాతంలోకి నాగబాబు అనుచరుడు దాస్

బెజవాడ గ్యాంగ్‌వార్ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నామని.. అలాగే సందీప్ హత్యకు కారణమైన 13 మందిని, అలాగే పండుపై దాడి చేసిన 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హర్షవర్థన్ వివరించారు. కాగా ఓ అపార్ట్‌మెంట్ విషయంలో సెటిల్‌మెంట్ జరిగిన విషయం నిజమేనని డీసీపీ అంగీకరించారు.

అయితే పండు-సందీప్ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్ గ్యాంగ్ ముందు పండు కుర్చీలో నుంచి లేవకపోవడంతో ‘‘ పిల్లోడివి నా ముందే కూర్చుంటావా’’ అంటూ సందీప్ వర్గానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కర్రతో రెండుసార్లు కొట్టడంతో ఒక్కసారిగా గొడవ చెలరేగిందని డీసీపీ వివరించారు.

ఈ ఘర్షణ మొత్తానికి కిరణే కారణమని, అతడు రెచ్చగొట్టడం వల్లే గొడవకు దారి తీసిందని హర్షవర్థన్ చెప్పారు. సెటిల్‌మెంట్ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సందీప్... పండు ఇంటికెళ్లి బెదిరించగా, ఆ తర్వాత పండు కూడా సందీప్ షాపు దగ్గరకు వెళ్లి హల్ చల్ చేశాడని డీసీపీ వెల్లడించారు.

రెండు గ్యాంగుల్లో ఉన్నవారంతా క్రిమినల్సేనని, అందరికీ క్రిమినల్ హిస్టరీ ఉందని హర్షవర్థన్ పేర్కొన్నారు. సందీప్ తన ఫ్రెండ్స్‌నే ఉపయోగించుకున్నాడని.. వీరందరికీ స్కూళ్లలో పరిచయం వుందని హర్షవర్ధన్ తెలిపారు. బెదిరించాలనే వెళ్తే.. చంపుకునేంత వరకు వ్యవహారం వెళ్లిందని డీసీపీ అన్నారు.

Also Read:బెజవాడ గ్యాంగ్ వార్: పండు ముఠా దాడిలోనే సందీప్ మృతి, అరెస్టయిన 13 మంది వీరే...

కాగా సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల హస్తం వుందంటూ ఆయన భార్య తేజస్వినీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీసీపీ కొట్టిపారేశారు. సందీప్ హత్య వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు లేరని తేల్చి చెప్పారు.

కిరణ్ వల్లే గొడవకు కారణమని... నిందితుల్లో ముగ్గురు మంగళగిరి నుంచి వచ్చారని హర్షవర్థన్ వెల్లడించారు. పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ ఉందని.. ఓ కేసులో ఆమె పేరు వుందని డీసీపీ తెలిపారు. ఈ ఘర్షణలో ఆమె పాత్ర ఉందని తేలితే అరెస్ట్ చేస్తామని హర్షవర్థన్ వెల్లడించారు. 
 

click me!