కలెక్టర్ కార్యాలయం నిర్వాకం: విజయవాడలో నో లాక్ డౌన్

By Sreeharsha GopaganiFirst Published Jun 24, 2020, 7:42 AM IST
Highlights

కరోనా లాక్ డౌన్ పై కృష్ణ జిల్లా కలెక్టర్ కార్యాలయం గందరగోళం సృష్టించింది. తొలుత లాక్ డౌన్ ఉందంటూ ఉత్తర్వులు ఇచ్చి, ఆ తరువాత దాన్ని ఉపాయాసంహరిస్తున్నట్టుగా మరల ఉత్తర్వులను ఇచ్చారు. 

ఈ నెల 26 నుంచి వారంరోజులు పాటు విజయవాడతో పాటు కృష్ణా జిల్లా లో లాక్డౌన్ అమలులో ఉంటుందంటూ కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. కలెక్టర్ మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్నీ చెప్పారు. 

ఇక ఆ తరువాత గంట వ్యవధిలోనే లాక్ డౌన్ ఉండదంటూ... దానిని ఉపసంహరిస్తున్నామంటూ ఉత్తర్వులను జారీ చేసింది కలెక్టర్ కార్యాలయం. 

ఉపసంహరణ విషయంలో అధికారులు స్పష్టత ప్రదర్శించకపోవడంతో... ఈ పరిస్థితి ఏర్పడింది. ముందుగా విజయవాడలో లాక్ డౌన్ ఉంటుందని ప్రెస్ నోట్ జారీ చేసారు ఆతరువాత గంట సమయానికే..... విజయవాడలో కూడా లాక్ డౌన్ ఉపసంహరిస్తున్నట్లు మరో ప్రెస్ నోట్ విడుదల చేసారు. 

లాక్ డౌన్ అమలుపై స్వయంగా కలెక్టర్ ఇంతియాజ్ వీడియో విడుదల చేసారు. ఆయన వీడియో, ఆ తరువాత ప్రెస్ నోట్, మరోసారి మరో ప్రెస్ నోట్.... ఈ నేపథ్యంలో అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాక అందరూ జుట్టు పీక్కున్నారు.  విడుదలైన ప్రెస్ నోట్ నిజమా, లేదా  ఎవరైనా నకిలీవి తాయారు చేసారా అని కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేయవలిసి వచ్చింది 

ఇకపోతే... లాక్‌డౌన్ సడలింపులు తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌లు మొదలవుతున్నాయని, విజయవాడ లో కూడా కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నెల 26 నుంచి విజయవాడ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తొలుత తెలిపారు.

మెడికల్ షాపులు, అత్యవసర దుకాణాలు మినహా అన్నీ మూసివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యవసరం కానీ ప్రైవేట్, పబ్లిక్ కార్యాలయాలు కూడా మూసివేస్తామని మేజిస్ట్రేట్ తెలిపారు.

కోవిడ్ 19 చైన్ ను కట్ చేసేందుకు ప్రస్తుత పరిస్ధితుల్లో లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఇంతియాజ్ వెల్లడించారు. రేపు, ఎల్లుండి నగర వాసులు తమకు కావాల్సిన నిత్యావసరాలు తెచ్చుకోవాలని కలెక్టర్ విజ్ఙప్తి చేశారు.

లాక్‌డౌన్ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగొద్దని, ప్రజా రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు ఇంతియాజ్ వెల్లడించారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తి జరుగుతోందని.. అలాంటి చోట్ల కఠిన నియమాలు అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

బెజవాడలో వచ్చే వారంపాటు ఎలాంటి లాక్‌డౌన్ సడలింపులు వుండబోవని జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. వారం తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఇంతియాజ్ వెల్లడించారు. కాసేపటికే విడుదల చేసిన ప్రెస్ నోట్లతో కొత్త గందరగోళంసృష్టించింది. 

click me!