వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి రామోజీ రావుపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మహిళా ఉద్యోగితో సంబంధం ఆరోపణలపై మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. కొన్ని మీడియా సంస్థలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రామోజీ రావుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.విజయ సాయిరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్న ముఖ్యుల్లో ఈయన ఒకరు. 2016లో మొదటిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2022లో వైసీపీ అధికారంలో ఉండగా రెండో పర్యాయం రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే, 2024 సార్వత్రి ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
స్వతహాగా సీఏ అయిన విజయసాయి రెడ్డి మంచి వాగ్దాటి ఉన్నవారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలతో సన్నిహితంగా ఉంటారన్న పేరుంది. వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు నడిపారు. పార్లమెంటులో అనేక బిల్లులకు బీజేపీకి మద్దతు ఇచ్చారు. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 16 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో కీలక భాగస్వామి అయ్యారు. ఈ తరుణంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి విజయసాయి రెడ్డి హెచ్చరిక చేసినట్లు మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి తమతోనూ అవసరం ఉంటుందని గుర్తుచేశారు. రాజ్యసభలో 11 మంది సభ్యులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే నాలుగో అతిపెద్ద అని... ఎన్‌డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు తమ మద్దతు కావాల్సిందేనని చెప్పారు.
ఇలా తమకు అవసరం ఉందనుకున్నా, దూరం పెడతారని భావించినా, తమ తప్పులను ఎత్తిచూపినా విజయసాయి రెడ్డి లక్ష్యం చేసుకుంటారు. గత ఐదేళ్లు కేంద్రంతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి.. ఓటమి అనంతరం సడెన్‌గా టోన్ మార్చడమే ఇందుకు నిదర్శనం.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో అయితే గడిచిన ఐదేళ్లు ‘వైసీపీ వర్సెస్ టీడీపీ’, ‘వైసీపీ వర్సెస్ ఈనాడు’ అన్నట్లు పోరు నడిచింది. 2019 నుంచి 2024 వరకు ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షమైనప్పటికీ దానికంటే ఈనాడుపైనే వైసీపీ ఎక్కువ దృష్టి పెట్టింది. ఈనాడు యజమాని అయిన రామోజీ రావు, ఆయనకు చెందిన ఇతర సంస్థలను అనేక విధాలుగా కట్టడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. మార్గదర్శిపై దాడులు ఏ స్థాయికి వెళ్లాయో అందరికీ తెలిసిందే. ఇక వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్ పెడితే చంద్రబాబు, టీడీపీ కంటే ఈనాడును, రామోజీ రావును ఎక్కువగా దూషించేవారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ఈనాడులో రాసే కథనాలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుండేవారు. కొన్నిసార్లు ఈనాడు కార్యాలయాలపైనా దాడులు జరిగాయి.
అలాగే, వైసీపీ సోషల్ మీడియా కూడా ఈనాడు, రామోజీ రావును టార్గెట్ చేసుకొని పోస్టులు పెట్టేది. ట్రోలింగ్ చేసేది. ఇదంతా ఒక ఎత్తయితే విజయసాయి రెడ్డి రామోజీ రావును ఉద్దేశిస్తూ ట్వీట్లు పెట్టడం, బహిరంగంగా సవాళ్లు విసరడం మరో ఎత్తు. రామోజీ రావుతో పాటు ఆయనకు చెందిన సంస్థలపై కంప్లైంట్లు చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి రామోజీ రావు ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళా ఉద్యోగితో తనకు లేని సంబంధాన్ని ఉన్నట్లు ఓ వర్గం మీడియా ప్రచారం చేసిందని మండిపడ్డ విజయసాయి... అలాంటి వాళ్ల అంతు చూస్తానని హెచ్చరించారు.
‘‘విజయసాయి రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏం చేస్తాడలే అని తేలికగా తీసుకోవద్దు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే వదలడు. ఆరోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. ఆయనతో నేనెప్పుడు కలవలేదు. అయినా, ఒక సంవత్సరం రోజులు ట్విటర్ ద్వారా రామోజీరావును వేధించా. ఏం చేశాడు..?’’ అని విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. ఇటీవల చనిపోయిన రామోజీ రావు పేరును విజయసాయి రెడ్డి ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. విజయసాయి రెడ్డి రామోజీరావును అంతగా ఏం వేధించారన్నది చర్చనీయాంశంగా మారింది.