ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు కీలక సూచన చేశారు. తన కాళ్లకు నమస్కారం చేయడం మానుకోవాలని కోరారు.
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కారం చేసే పని చేయవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని... ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని.. నాయకులకు కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు నేరుగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.. తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని సీఎం తెలిపారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఆత్మగౌరవంతో అంతా నడుచుకోవాలని.. కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
కాగా, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజల వద్దకు పాలన చేరువ చేసిన ఘనత ఆయనది. ఈ నేపథ్యంలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తరచూ ప్రజలను కలుస్తున్నారు. తాజాగా శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి... శనివారం ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై ప్రజలు సిఎంకు విన్నవించారు. నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశమివ్వాలని పలువురు కార్యకర్తలు, నాయకులు చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్, మహ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు లక్ష విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇతరు నేతలు పాల్గొన్నారు.
పాపకు రూ.16 కోట్ల ఇంజక్షన్ కోసం సాయం...
గుంటూరుకు చెందిన వెచ్చా ప్రీతమ్ దంపతులు తమ పాప హితైషీను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఏడాది వయసున్న హితైషీ తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. స్పైనల్ మస్‌క్యులర్ అట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలి అంటే Zolgensma అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర రూ.16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం తన చాంబర్‌లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు.