ఉద్యోగిణితో సంబంధంపై స్పందించిన విజయసాయి రెడ్డి.. వారిని వదలబోనని శపథం

By Galam Venkata Rao  |  First Published Jul 15, 2024, 12:13 PM IST

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. దేవదాయ శాఖలోని ఉద్యోగిణితో సంబంధం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై విపరీతమైన చర్చ జరుగుతుండగా.. ఈ ఆరోపణలను నిరాధారమైనవని విజయసాయి రెడ్డి కొట్టిపారేశారు.


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ మారారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆయన ఇప్పుడో వివాదంలో ఇరుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిణితో వివాహేతర సంబంధం ముడిపెడుతూ ఆమె భర్తనంటూ ఒకరు రాసిన లేఖ బయటపడటంతో వైసీపీ ఇప్పుడు ఇరుకున పడింది. సోషల్‌ మీడియాలో ఈ అంశంపై విపరీతంగా చర్చ జరుగుతుండగా.. ఇప్పటికే సదరు ఉద్యోగిని వివరణ ఇచ్చారు. ఈ అంశంపై విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. 

దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతితో సంబంధం ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. తనపై ఓ వర్గం మీడియా నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తనను సదరు మహిళా ఉద్యోగి ఒకటీ రెండు సార్లు కలిసిన మాట వాస్తవమేనని... అయితే, సహాయం కోసమే ఆమె తనను కలిశారని చెప్పారు. తండ్రి వయసున్న తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలు, ఇతర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ దాఖలు చేయడంతో పాటు కేంద్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖలతో పాటు మహిళా, మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కొందరు మీడియా ప్రతినిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని చెప్పారు. సోషల్‌ మీడియా, మీడియాలో ఉన్న కొందరిని శిక్షించేందుకు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతానని తెలిపారు. ఒక సామాజికవర్గానికి చెందిన మీడియా, మీడియా ప్రతినిధులు మాత్రమే తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘ఒక మహిళా ఉద్యోగిపై ఫిర్యాదు చేస్తే బుద్ధిలేని దేవదాయ శాఖ కమిషనర్‌ ఎలా దాన్ని బహిర్గతం చేస్తారు’ అని ప్రశ్నించారు. 

Latest Videos

undefined

ఉద్యోగిణిపై ఆరోపణ ఇదీ..

మదన్‌మోహన్‌ మానిపాటి అనే వ్యక్తి దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ కె.శాంతిపై ఆరోపణలు చేశారు. ఆమె తన భార్య అని.. తాను విదేశాల్లో ఉండగా వేరొకరితో గ‌ర్భం దాల్చిందని.. దీనిపై విచారణ జరిపి.. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, న్యాయవాది సుభాష్‌లే కారణమనే ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు. పవిత్రమైన దేవదాయ శాఖలో ఈ అపవిత్రమైన పనులేంటని మదన్మోహన్ లేఖలో ప్రశ్నించారు. 

ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకు వచ్చారు. తనకు విజయసాయి రెడ్డితో సంబంధం అంటూ ప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మదన్‌మోహన్‌ మానిపాటితో 2016లోనే తాను విడిపోయానని స్పష్టం చేశారు. తాము విడిపోయాక 2020లో సుభాష్‌ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయనతోనే కలిసి జీవిస్తున్నానని చెప్పారు. సుభాష్‌తోనే బిడ్డను కన్నానని స్పష్టం చేశారు. మదన్‌మోహన్‌తో తనకు 2013లో పెళ్లవగా.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని తెలిపారు. అతని వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు.
మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్‌మోహన్‌ తనను తీవ్రంగా వేధించారని శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డిని విశాఖపట్నంలో తాను అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసేటప్పుడు మాత్రమే కలిశానన్న శాంతి.. శాఖాపరమైన అంశాలనే ఆయనతో చర్చించినట్లు స్పష్టం చేశారు.

click me!