సొంత పార్టీ నేతలను, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో అలజడి..!

By Sumanth KanukulaFirst Published Oct 13, 2022, 10:26 AM IST
Highlights

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డిని నెంబర్ 2గా చెప్పుకునేవారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలలో విజయసాయి రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తారు. అయితే గత  కొంతకాలంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు, విజయసాయిరెడ్డికి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ వైసీపీలో అలజడి సృష్టించే విధంగా ఉన్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డిని నెంబర్ 2గా చెప్పుకునేవారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలలో విజయసాయి రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తారు. అయితే గత  కొంతకాలంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు, విజయసాయిరెడ్డికి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం సాగుతుంది. విజయసాయి రెడ్డిని వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారనే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి వైసీసీలో విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఏదో జరుగుతుందనే ప్రచారం మరింత విస్తృతంగా సాగుతుంది. 

అయితే ఈ ప్రచారాన్ని విజయసాయి రెడ్డి పలు సందర్భాల్లో ఖండించారు.  అయితే విశాఖలో భూములు, ఆస్తుల వ్యవహారంలో వస్తున్న ఆరోపణలపై స్పందించిన విజయసాయి రెడ్డి.. ఆ సమయంలో చేసిన కొన్ని కామెంట్స్‌ వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు వైసీపీలో తెరవెనక ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

సొంత పార్టీ నేతలనే ఇరకాటంలో పెట్టేలా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కూర్మన్నపాలెం హయగ్రీవ వెంచర్‌లో భూయజమానికి ఒక శాతం ఇచ్చి.. ప్రాజెక్టు డెవలపర్‌ 99 శాతం తీసుకున్నారని.. ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నానని అన్నారు. ఇలాంటి ఒప్పందాలను మీడియా ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అయితే ఈ ప్రాజెక్టులో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రధాన భాగస్వామి కావడం గమనార్హం. దసపల్లా వ్యవహారంలో తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడానికి.. కూర్మన్నపాలెంలో ప్రాజెక్టు పేరును విజయసాయిరెడ్డి ఇలా చేశారా? లేక కావాలనే ఎంవీవీ సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని ఈ విధమై కామెంట్ చేశారా? అనేది వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. 

అయితే తన గురించి పార్టీలోని వ్యక్తులే మీడియాకు సమాచారం ఇస్తున్నట్లు కొందరు చెప్పారని.. ఆధారాలుంటే వారిపై పార్టీపరంగా చర్య తీసుకుంటామని విజయసాయిరెడ్డి చెప్పడం వైసీపీ నాయకుల మధ్య అంతర్గత  విబేధాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

అలాగే విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. తాను న్యూస్ ఛానెల్ ప్రారంభించి.. సొంత పార్టీ ఎంపీల భూ కుంభకోణాలను బయటపెడతానని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగడమే కాకుండా.. వార్తాపత్రికను కూడా ప్రారంభిస్తానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్.. వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అసంతృప్తిని తెలియజేస్తున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 

అయితే వైసీపీ అధిష్టానానికి సన్నిహిత వర్గాలు కూడా.. సాక్షిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి కావని తెలిపాయి. మరోవైపు కొంతకాలం క్రితం విజయసాయిరెడ్డి కుటుంబీకులు కుదుర్చుకున్న భూ ఒప్పందాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఇన్‌పుట్‌లను సేకరించి.. సీఎం జగన్‌కు చేరవేశాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విశాఖలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా విజయసాయి రెడ్డి నుంచి అనుమతులు పొందిన తర్వాతే కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చిందని.. ఈ క్రమంలోనే ఆయన ఉత్తరాంధ్ర జిల్లా వైసీపీ ఇంచార్జ్‌ను ఆయన తొలగించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

మరోవైపు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్‌పై ఎంవీవీ సత్యనారాయణ కూడా ఘాటుగా స్పందించారు. విజయసాయి రెడ్డి ప్రతిదీ ప్రకటించారని.. కేవలం కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే సమయంలో ఆగిపోయాడని విమర్శలు సంధించారు. 

విజయసాయి రెడ్డి కామెంట్స్‌తో గందరగోళంలో వైసీపీ శ్రేణులు... 
మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన వైసీపీ.. అక్కడ చాలా భూములు చంద్రబాబు సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయనే ఆరోపణను ప్రధానంగా  తెరమీదకు తీసుకువస్తుంటుంది. అందుకే రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో.. మూడు రాజధానులను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతుంది. విజయసాయి రెడ్డి కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. అయితే తాజాగా విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్.. అందుకు విరుద్దంగా ఉన్నాయి. 

విశాఖలో ఎక్కువ శాతం భూములు చంద్రబాబు సామాజికవర్గం చేతులోనే ఉన్నాయని..  ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత దస్పల్లా భూముల్లో అత్యధికంగా లబ్ధి పొందిన వారు అదే వర్గానికి చెందిన వారేనని ఆరోపించారు. విశాఖ, ఉత్తరాంధ్రలో కాపులు, యాదవులు, వెలమలు ఎక్కువగా ఉన్నా భూములు, ఆస్తులు మాత్రం చంద్రబాబు వర్గం చేతిలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విధమైన కామెంట్స్ చేయడంతో.. అసలు విజయసాయి రెడ్డి ఏం చెబుతున్నారనేది వైసీపీ శ్రేణుల్లోనే చాలా మందికి అర్థం కావడం లేదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్ తీసుకురావడం ద్వారా తాము చంద్రబాబు సామాజిక వర్గానికే లబ్ది  చేకూరుస్తున్నామని విజయసాయి రెడ్డి చెప్పదలుచుకున్నారా? అని కొందరు వైసీపీ నేతలే అంతర్గత సంభాషణలో చర్చించుకుంటున్నారు.   

అలాగే తాను విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. పార్టీలో ఓ వర్గం నేతలతో ఆయనకు పడటం లేదని తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్‌తో ఆయనకు దూరం పెరిగిందని.. సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేయడం ద్వారా పార్టీలో అంతర్గత పోరును బహిర్గతం చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలోనే న్యూస్ ఛానెల్ పెట్టనున్నట్టుగా ప్రకటించిన విజయసాయి రెడ్డి ప్రకటించడం.. సాక్షి మీద అసంతృప్తే కారణమని వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా తన మీద వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు ఏర్పాటు చేసిన విజయసాయిరెడ్డి.. సొంత పార్టీలనే అలజడి సృష్టించారనేది స్పష్టం అవుతుంది. 
 

click me!