తిరుమలలో బాలుడి కిడ్నాప్.. 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ..

Published : May 03, 2022, 10:02 AM ISTUpdated : May 03, 2022, 10:05 AM IST
తిరుమలలో బాలుడి కిడ్నాప్.. 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ..

సారాంశం

తిరుమలలోని గొల్లమండపం సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమలలోని గొల్లమండపం సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ ఎక్కడికి వెళ్లిందని ట్రాక్ చేస్తున్నారు. అయితే బాలుడి కిడ్నాప్ జరిగి 24 గంటలు గడస్తున్నా ఆచూకీ లభించలేదు. దీంతో బాలుడి తల్లి తీవ్ర ఆందోళన చెందుతుంది. 

వివరాలు.. కిడ్నాప్‌కు గురైన బాలుడి కుటుంబం తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటుంది. బాలుడి తండ్రి హోటల్‌లో పనిచేస్తుండగా, తల్లి స్వాతి శ్రీవారి ఆలయానికి సమీపంలో భక్తుల నుదుటి గోవింద నామాలు పెడుతూ అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం స్వాతి తన పనిలో నిమగ్నమై ఉండగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం సమీపంలో ఉన్న బాలుడి వద్దకు ఓ మహిళ వచ్చి అతనితో కాసేపు గడిపింది. ఆమె అతనికి కొన్ని స్వీట్లు అందించింది. సాయంత్రం 5.15 గంటలకు బాలుడిని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయింది. 

సాయంత్రం 5.45 గంటలకు కొడుకు కనిపించడంతో స్వాతి గుడి చుట్టుపక్కల వెతికింది. అతడి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నీలిరంగు చొక్కా, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి ఉన్న బాలుడిని.. పింక్ చూడీదార్ ధరించిన మహిళ తీసుకుని వెళ్తున్నట్టుగా గుర్తించారు. ఆదివారం రాత్రి 7.20 గంటలకు మహిళ బాలుడితో కలిసి బస్సులో తిరుపతికి వెళ్లినట్టుగా పోలీసులు కనుగొన్నారు. 

తిరుపతిలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా మహిళ రాత్రి 8.10 గంటల ప్రాంతంలో బాలుడిని గోవిందరాజ స్వామి ఆలయానికి, అక్కడి నుంచి 8.50 గంటలకు విష్ణు నివాసం యాత్రికుల సౌకర్యాల సముదాయానికి తీసుకెళ్లినట్లు గుర్తించామని తిరుమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే చంద్రశేఖర్ తెలిపారు. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆమె రైల్వే స్టేషన్‌లో కనిపించింది. అక్కడ ట్రైన్ టికెట్ కొనుగోలు చేసి.. ప్లాట్‌ఫామ్ నెంబర్ 2, 4లలో తిరుగుతూ కనిపించింది. చివరిగా ఆమె సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కనిపించింది. ఆ తర్వాత ఆమె కదలికలను పోలీసులు గుర్తించలేకపోయారు. 

దీంతో పోలీసలు ఆ సమయంలో తిరుపతి నుంచి బయలుదేని రైళ్ల షెడ్యూల్ ఆధారంగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. వివిధ రైల్వే స్టేషన్లకు పంపారు. ఇందుకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్) కింద కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, బాలుడిని తీసుకుని మహిళ.. తమిళనాడుకు వెళ్లే రైలులో వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, మహిళ ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu