వారు ఒప్పుకుంటే...ఆ ఇంట్లో సచివాలయం, అక్కడ రాజధాని అయినా ఓకే: వర్ల సంచలనం

By Arun Kumar PFirst Published Aug 4, 2020, 8:50 PM IST
Highlights

ప్రతిపక్షనేత చంద్రబాబు ఛాలెంజ్ సీఎం జగన్ కు అర్థమైందో లేదో తెలియడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 

గుంటూరు: టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి 19 గంటలైందని... ప్రతిపక్షనేత ఛాలెంజ్ సీఎం జగన్ కు అర్థమైందో లేదో తెలియడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. దేశమంతా రాష్ట్రంలో ఏం జరుగుతోందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తోందని అన్నారు. 

మంగళవారం ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జగన్ నైజం, ఆయన ప్రవర్తనపై దేశమంతా ఉత్కంఠ తో ఉందని... తనకు 151 సీట్లున్నాయి కాబట్టి రాజ్యాంగంతో నాకు పనిలేదు, ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానన్న వైఖరిని దేశం గమనిస్తోందన్నారు. రాష్ట్రంలో 3 రాజధానులు పెడతానని జగన్ చెప్పినప్పుడు దేశం మొత్తం ఉలిక్కిపడిందని... ఇదెక్కడి వింత అని వాపోయిందన్నారు. 

తాము అధికారంలోకి వస్తే రాజధాని మారస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టలేదని... జగన్ గానీ, ఆయనపార్టీ వారు తాము అధికారంలోకి వస్తే మూడు రాజధానులపెట్టి రాష్ట్రాన్ని మూడుముక్కలు చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. ప్రజలకు తెలియంది, వారికి చెప్పంది, మీరు చేస్తున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని జగన్ కు సవాల్ చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షనేత సవాల్ పై ప్రభుత్వం నుంచి గానీ, మంత్రుల నుంచీ గానీ ఏ విధమైన స్పందన లేదని వర్ల తెలిపారు. 

శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్దామని... ఇందులోనూ వైసిపి గెలిస్తే రాజధాని ఇడుపులపాయలో పెట్టుకున్నా, తాడేపల్లిలో సీఎం నివాసంలో సెక్రటేరియట్  పెట్టుకున్నా తామేమీ మాట్లాడబోమన్నారు. ఎన్టీఆర్ మాదిరే జగన్ కూడా ప్రజల తీర్పుకోరి తన విశ్వసనీయత ఏమిటో నిరూపించుకోవాలన్నారు. తన మాటను తానే కాదన్నందుకు జగన్ ఖచ్చింతగా ఎన్నికలకు వెళ్లి తీరాల్సిందేనని వర్ల తేల్చిచెప్పారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో తెలియడం లేదన్నారు వర్ల. 

read more  జగన్ కు దమ్ముంటే ఆ సవాల్ ను స్వీకరించాలి...: నక్కా ఆనంద్ బాబు డిమాండ్

ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాల్సిన వారు ఆనాడొక మాట, ఇప్పుడొక మాట ఎలా చెబుతారన్నారు. ఆనాడు బొత్స మాట్లాడుతూ కబ్జాలు చేసేవారు, దోపిడీలు చేసేవారు, అరాచకశక్తులే రాజధాని మారుస్తారని చెప్పారని...ఆయన మాటలప్రకారం ఇప్పుడు జగన్మోహన రెడ్డి ఆరాచకశక్తా? లేక కబ్జాకోరా, దోపిడీదారా? అని ప్రశ్నించారు. బొత్స చెప్పినట్లుగా ముఖ్యమంత్రి ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారని మేం భావించాలా? అని  వర్ల మండిపడ్డారు. 

రోజా సభ్యత సంస్కారం లేకుండా నోరేసుకొని చంద్రబాబుపై పడిపోతుందని, ఇప్పుడు ఆమె ఏం సమాధానం చెబుతుందన్నారు.  ఆనాడు జగన్ ఇంట్లో పాలు పొంగించిన రోజా ఇప్పుడేం చెబుతుందో చెప్పాలన్నారు. చంద్రబాబు ఛాలెంజ్ పై ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని... కామ్ గా ప్రజల్ని మోసం చేయడం వీరికి అలవాటుగా మారిందన్నారు. ప్రజలు జగన్ కు 151 సీట్లు ఇచ్చింది రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారని...అలాకాకుండా ప్రజలను మోసగించడమే ఆయన తన పనిగా పెట్టుకున్నాడని వర్ల ధ్వజమెత్తారు. 

వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఉమ్మారెడ్డి తమ మేనిఫెస్టోలో కూడా అమరావతిని పొందుపరుస్తామని చెప్పలేదా అన్నారు. అనంతపురంలో ఉన్న అతను రాజధానికి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలని, శ్రీకాకుళం అతను కోర్టుకు వెళ్లాలంటే కర్నూలుకు వెళ్లడానికి ఎంతసమయం పడుతుందో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న దుగ్ధతోనే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాడన్నారు. 

ఈ 16 నెలల పాలనలో జగన్ రాష్ట్రంలో  ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ఎక్కడా చిన్న సిమెంట్ రోడ్డు కూడా వేయలేదని, ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నడవకుండా చీకటి దొంగల్లా ముఖ్యమంత్రి, ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం తిననన్ని చీవాట్లు న్యాయస్థానాల్లో  తిన్నది జగన్ ప్రభుత్వమేనని, ఆయన తన నిర్ణయంతో చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నాడన్నారు. తన నిర్ణయం కరెక్టని, ప్రజలు తనను నమ్ముతున్నారని భావించేట్టయితే జగన్ తక్షణమే శాసనసభను రద్దుచేసి, ఎన్నికలకు వెళ్లి తన మగతనం ఏమిటో నిరూపించుకోవాలని వర్ల  తేల్చిచెప్పారు. 
ప్రజలను మోసపుచ్చుతూ ఆనాడొక మాట ఇప్పుడొక మాట చెప్పడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించమన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతున్నారో తెలియడం లేదని, కరోనా వల్లే ప్రజలు రోడ్లపైకి రావడం లేదన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. 16 నెలలుగా రాష్ట్రానికి ఏమీ చేయని ముఖ్యమంత్రి, విశాఖకు వెళ్లి అక్కడేం చేస్తాడని వర్ల ప్రశ్నించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే  అమరావతి ప్రపంచపటంలో నిలిచేదన్నారు. చంద్రబాబుని దూషించడం, మంత్రులతో బూతులు మాట్లాడించడం తప్ప జగన్ చేస్తున్నదేమిటన్నారు. చంద్రబాబుని తిట్టాల్సిన అవసరం మంత్రులకు ఏమొచ్చిందని... వారి నిర్ణయం సరైనదైతే తమ ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎందుకు ఎన్నికలకు వెళ్లడం లేదని వర్ల నిలదీశారు. 

జగన్ వ్యక్తిగత జీవితం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదన్న వర్ల పరిపాలన సక్రమంగా చేయని వ్యక్తిని ప్రశ్నించే అధికారం ఒక పౌరుడిగా తనకుందన్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని జగన్ భావిస్తే తన ప్రభుత్వాన్నిరద్దుచేసి ఆయన తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని రామయ్య డిమాండ్ చేశారు. 

చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ను జగన్ స్వీకరించాలని, అప్పుడే ఆయన దమ్మేమిటో, ధైర్యమేమిటో తేలుతుందన్నారు.  జగన్ గెలిస్తే ఆయన ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చని... ప్రజాభీష్టం ఇంకోలా ఉంటే దానికి తలొగ్గాలని రామయ్య హితవుపలికారు.

click me!