జగన్ సీఎంగా విఫలమైనా ముద్దాయికి అన్నగా సఫలమయ్యారు..: వర్ల రామయ్య

Published : Jun 01, 2023, 11:23 AM IST
జగన్ సీఎంగా విఫలమైనా ముద్దాయికి అన్నగా సఫలమయ్యారు..: వర్ల రామయ్య

సారాంశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించడంపై టిడిపి నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. 

అమరావతి : సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసులో ముద్దాయి అయిన తమ్మున్ని కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలమయ్యారని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించడంలో విఫలమైనప్పటికి నేరంచేసిన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఆపగలిగాడని అన్నారు. బెయిల్ పొందినంత మాత్రాన అవినాష్ నిర్దోషి కాదని రామయ్య అన్నారు. 

వైఎస్ వివేకా హత్యకేసులో ఇటీవల కీలక పరణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ ఆయన తనయుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందంటూ ప్రచారం జరిగింది. పలుమార్లు అవినాష్ ను విచారించిన సిబిఐ అరెస్ట్ మాత్రం చేయలేదు. తాజాగా అవినాష్ ను అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే సీఎం జగన్ ఇటీవల డిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరిపిన మంతనాలే అవినాష్ బెయిల్ కు కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తన అవినీతి సొమ్ముతో బాబాయ్ హత్యకేసులో ముద్దాయగా వున్న తన తమ్ముడు అవినాష్ ను కాపాడుకోవడం సీఎం జగన్ సక్సెస్ అయ్యారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజల ద్వారా వచ్చిన అధికారాన్ని ప్రజాసేవకు ఉపయోగించడంలో విఫలమైనన జగన్ తమ్మున్ని కాపాడుకోవడంలో సఫలమయ్యారని ఎద్దేవా చేసారు. హత్యకేసులో ముద్దాయిని కాపాడేందుకు ముఖ్యమంత్రి తాపత్రయపడటం రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమని రామయ్య మండిపడ్డారు. 

Read More  అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్ .. జడ్జిలపై ఓ మీడియాలో దుష్ప్రచారం, టీడీపీకి అనుకూలంగా రాలేదనా : సజ్జల

ముఖ్యమంత్రి జగన్ గతంలో డిల్లీకి వెళ్లినపుడు తన అవినీతి కేసుల గురించి, ఇటీవల వెళ్లినపుడు వివేకా హత్యకేసు నుండి అవినాష్ రెడ్డిని కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసారని రామయ్య అన్నారు. విభజన హామీల్లోని ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ గురించి జగన్ ఏనాడు ప్రస్తావించలేదు... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదని అన్నారు. 

అధికారం, ధనబలం వున్న పెద్దలకు ఓ న్యాయం, సామాన్యులకు మరో న్యాయం జరుగుతోందని రామయ్య ఆందోళన వ్యక్తం చేసారు. హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ వచ్చింది కాబట్టి ఐపిసి 302 కూడా బెయిలబుల్ చేయాలని రామయ్య సూచించారు.  కనీసం జగన్ ముఖ్యమంత్రిగా వున్నంత కాలమైనా హత్యకేసు (ఐపిసి 302)లను కేవలం 41 నోటీసులతో సరిపెట్టి అరెస్టులు లేకుండా పార్లమెంట్ చట్ట సవరణ చేయాలంటూ రామయ్య ఎద్దేవా చేసారు. 

వివేకా హత్య కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన ఎంపీ అవినాష్ నిర్దోషి కాదని... విచారణ అనంతరమే ఆయన దోషో, నిర్దోషో కోర్టు నిర్ణయిస్తుందన్నారు. వివేకా హత్యకేసును సమర్దవంతంగా విచారించడంలో సిబిఐ విఫలమయ్యిందని...అనేక తప్పటడుగులు వేసిందన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటూ పదే పదే చెబుతూనే అతడు బెయిల్ తెచ్చుకునేలా సహకరించిందని ఆరోపించారు. ఈ కేసు విచారణతో సిబిఐ విశ్వసనీయత కోల్పోయిందని రామయ్య అన్నారు. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో కూడా ముద్దాయిలే నిర్దేశించటం శోచనీయమని...అధికార మదానికి నిదర్శనమని వర్ల రామయ్య మండిపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?