చంద్రబాబు లేఖపై మీ రియాక్షన్ ఇదా.. యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR)ఇవ్వగలరా?: డిజిపికి వర్ల లేఖ

By Arun Kumar PFirst Published Oct 8, 2020, 10:51 AM IST
Highlights

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు వర్ల రామయ్య. 
 

గుంటూరు: టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలని రాసిన లేఖపై పోలీసులు స్పందించిన తీరు గర్హనీయమని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మరో లేఖ రాశారు వర్ల రామయ్య. 

''పోలీసు శాఖకు కేసుల దర్యాప్తులో అసలు ముద్దాయిలను త్వరితగతిన అరెస్టు చేయమని చంద్రబాబు లేఖలో కోరడం తప్పా? రాజ్యాంగం ఇచ్చిన భావస్వేచ్చా హక్కును హరించేదిగా పోలీసు వ్యవస్థ తీరు ఉన్నది. రాజమండ్రిలో పదేళ్ళ ముస్లిం బాలికను బలవంతం చేయడానికి ప్రయత్నించిన ముద్దాయిల అరెస్టులో జాప్యమెందుకని ప్రశ్నించడం చంద్రబాబు చేసిన తప్పా?'' అని నిలదీశారు. 

''సంఘటన రిపోర్టు చేసిన తరువాత ఎన్నిరోజులకు కేసు రిజస్టరు చేశారు. ముద్దాయిలను ఎప్పుడు అరెస్టు చేశారు? బాధితుల ఇంటిపై దాడి చేసి ఫిర్యాదు వాపసు తీసుకోమని బాలిక తల్లిదండ్రులను బెదిరించింది నిజం కాదా? సంఘటన జరిగిన నాటి నుండి ముద్దాయిలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు బాధిత కుటుంబాన్ని బయటకు రాకుండా కాపలా కాసింది నిజం కాదా? బాలిక తండ్రి సత్తార్ ఆత్మహత్యా ప్రయత్నానికి కారణం పోలీసులు చెప్పగలరా? ఈ కేసులో పోలీసులు ఇంతవరకు తీసుకున్న చర్యలపై రాజమండ్రి వాసులకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ఇవ్వగలరా?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

read more  ఎన్డీఎలో వైసీపీ చేరిక: అదంతా వైఎస్ జగన్ మైండ్ గేమ్?

''సీతానగరం శిరోముండనం కేసులో ఎస్ ఐ ఫిరోజ్ ఫోన్ కాల్ లిస్టు పరిశీలించి అసలు ముద్దాయిలను ఎందుకు అరెస్టు చేయలేదు? ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు ప్రతాప్ ఫోన్ కాల్ లిస్టు పరిశీలించి ఆత్మహత్యకు కారకులైన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?  పల్నాడులో దళిత యువకుడు విక్రమ్ హత్యకు పరోక్ష కారకుడిగా చెప్పబడుతున్న సీఐ దుర్గాప్రసాద్ కాల్ లిస్టు ఎందుకు పరిశీలించలేదు?  ఆరుగురు దళిత కుటుంబ సభ్యులను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన అసలు ముద్దాయిలను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు?'' అని అడిగారు. 

''పోలీసులు వెంటనే స్పందించకపోవడం వల్ల అత్యాచార కేసులు మహిళలపై పెరుగుతున్నది నిజం కాదా? దర్యాప్తులు పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారులు కాకుండా ఆఫీసులో కూర్చునే టెక్నికల్ డిఐజి కేసుల గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తప్పు పట్టడం సబబా? ఇప్పటికైనా డీజీపీ ఈ కేసులన్నింటిని సమీక్షించి రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్నిస్తూ యాక్షన్ టెకెన్ రిపోర్ట్ (ATR)ప్రజల ముందుంచాలి" అని కోరారు. 

''ఇన్ని లేఖలు వ్రాసినా చంద్రబాబు ఏ ముద్దాయి పేరు చెప్పటం గానీ, సూచించటం గానీ జరగలేదు. అసలు సిసలైన నేరస్థులను అరెస్టు చేయమని కోరటంకూడా తప్పా? పోలీసు శాఖ ఈ విధమైన స్పందన రాజకీయ ప్రోద్భల వాసన కొడుతున్నది నిజం కాదా?'' అని నిలదీశారు.
 

click me!