ఆడబిడ్డలను రక్షించేది చంద్రబాబే... ఈ చేతగాని సీఎం గురించి మాట్లాడటమే వేస్ట్..: వంగలపూడి అనిత

By Arun Kumar PFirst Published May 12, 2022, 2:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలను రక్షించడం ఈ ముఖ్యమంత్రి జగన్ కు చేతకాదని అర్థమయ్యిందని... ఆడబిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసని వంగలపూడి అనిత అన్నారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ పై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. సీఎం కావాలనే ఒకే ఒక్క టార్గెట్ తో అక్క, చెల్లెమ్మలను మోసం చేసి ఓట్లేయించుకొన్నారు. ఇప్పుడు అదే చెల్లెమ్మలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగుతున్నా ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా లేదని అనిత ఆందోళన వ్యక్తం చేసారు. 

''ఆడబిడ్డలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం తాడేపల్లి ప్యాలెస్ ను వదలిరావడం లేదు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలకు కామాలే తప్ప పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు రెండు మూడు వింటూనే ఉన్నాం. బయటికి రాని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయో. ఇది ప్రజా ప్రతినిధుల వైఫల్యమో, ప్రభుత్వ నిర్లక్షమో, జగన్ బాధ్యతా రాహిత్యమో అర్థం కావటంలేదు. పైగా అత్యాచారాలు యాధృచ్ఛికమని హోం మంత్రి మాట్లాడటం ఆమె బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం'' అని అనిత మండిపడ్డారు. 

''బాధ్యతారాహిత్యం, చేతకానితనం, నిస్సహాయత, రాజకీయ అనుభవం లేకపోవటం,  పరిపాలనపై పట్టు సాధించలేకపోవటంతోనే రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.  చేతకాని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్. ఇటువంటి సంఘటనలు ఏ రాష్ట్రంలోనూ జరగడంలేదు. గోరంట్లలో ఒక మహిళను అతి దారుణంగా చంపేస్తే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి పోలీసులు పడుతున్న పాట్లు ఒకవైపు... ఆ కన్నతల్లి రోదన, ఆవేదనను అర్థం చేసుకోలేని నాయకులు అధికారులు మరోవైపు. రాప్తాడు నియోజకవర్గంలో అతి కిరాతకంగా ఓ మహిళని చంపేస్తే చర్యలు శూన్యం. మచిలీపట్నంలో 6 సంవత్సరాల ఆడబిడ్డ పై అఘాయిత్యం జరిగింది. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా చర్యలు లేవు. కామాంధుల అఘాయిత్యాలను అరికట్టలేని స్థితిలో ప్రభుత్వముంది'' అని ఆవేదన వ్యక్తం చేసారు. 

''చోడవరంలో 7 సంవత్సరాల ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగింది. డీజీపీ, సీఎం కు చెందిన కడప జిల్లాలో 15 సంవత్సరాల ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 6 నెలల గర్భవతి అయినా పోలీసులు నిర్లక్షం చేశారు. వారి జిల్లాలోని ఆడబిడ్డలకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ ఉంటుంది? పోలీసు అధికారులు వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి రాజకీయ లబ్ది పొందడానికే చూస్తున్నారు. ఇలాంటి సంఘటనలు బయటికి రాకుండా చూడాలనే తపన తప్ప ఆడబిడ్డలను రక్షించాలనే ఆలోచన ప్రభుత్వ అధికారులకు లేదు'' అని ఆరోపించారు. 

''లేని దిశ చట్టంపై రివ్యూలు జరుపుతారుగానీ పోతున్న మాన ప్రాణాలపై రివ్యూ పెట్టరు. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాడుతున్న  ప్రతిపక్షాలను నానా యాగి చేస్తున్నారనడం హాస్యాస్పదం. తిరుపతమ్మ అనే మహిళను సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేస్తే విద్యాదీవెన కార్యక్రమంలో అంతమంది విద్యార్థుల ఎదుట ప్రతిపక్షాలను నానా యాగి చేస్తున్నారనడం అన్యాయం.  జగన్ సీఎం స్థానానికి అనర్హుడు. హోం మంత్రికి ఆ పదవి రావడం యాదృక్షికమేమో కానీ అత్యాచారాలు జరగడం యాదృక్షికం కాదు.  హత్యాచారాలు, అత్యాచారాలు యాదృక్షికం అని మాట్లాడటం సబబుకాదు. బాధితురాళ్ల తల్లుల తప్పుల గురించి మాట్లాడటంలో అర్థంలేదు. నిందితులను శిక్షించాలని, ఆడబిడ్డలను కాపాడుకోవాలి అనే చిత్తశుద్ది ఉంటే తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటికి రావాలి'' అని అనిత సూచించారు.

''తెలుగుదేశం నాయకులపై ట్రిగ్గర్ పెడుతున్నారు. అక్రమ అరెస్టులు, దాడులు చేస్తున్నారు. నారాయణను అరెస్టు చేయడం కొండను తవ్వి ఎలుకను పట్టటమే. టీడీపీ నాయకులపై కేసులు పెట్టటంలో చూపే శ్రధ్ధ ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను పట్టుకోవటంలో, శిక్ష విధించడంలో చూపాలి. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలడు. మహిళా ప్రజా ప్రతినిధులు బయటికొచ్చి జగనన్న జపం మాని జనాల గురించి ఆలోచించాలి. చంద్రబాబు, లోకేశ్ లను విమర్శించడం ఒకఎత్తైతే జగన్ ను పొగడడం మరో ఎత్తు.  ఇంతమంది పై అఘాయిత్యాలు జరుగుతున్నా ఎందుకు నోరు విప్పటంలేదు?'' అని ప్రశ్నించారు. 

''ఏ ఆడపిల్లపైనైనా అఘాయిత్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని  సినిమా డైలాగ్ చెప్పారు. గన్ కల్చర్ అయితే వచ్చిందికానీ జగన్ రావడంలేదు. గన్ కల్చర్ వచ్చింది ఆడపిల్లల్ని రక్షించడానికి కాదు చంపడానికి. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించలేదనే అక్కసుతో ఆ అమ్మాయిని తుపాకితో కాల్చి తాను కూడా తుపాకితో కాల్చుకొని చనిపోవడం గన్ కల్చర్ కు నిదర్శనం. నాటు తుపాకులు తయారుచేసే పరిస్థితిని కూడా రాష్ట్రంలో కల్పించారంటే ఇంతకు మించిన శాంతిభద్రతల లోపం ఎక్కడ కనిపిస్తోందో అర్థం చేసుకోవచ్చు'' అన్నారు. 

''గడప గడపకి వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఈ మూడు సంవత్సరాల్లో అఘాయిత్యాలతో చనిపోయిన ఆడబిడ్డల ఇళ్ల గడప గడపకి వెళ్ళి పరామర్శించండి. అంతేకానీ విమర్శించడం మానండి. అఘాయిత్యానికి పాల్పడినవవారి స్థానంలో మీ బిడ్డో, నా బిడ్డో ఉంటే ఎలా ఉంటుందో ఒక్క సారి ఈ వైసీపీ ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని ఎలా రక్షించుకోవాలో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. ఆడబిడ్డను తప్పుగా చూసే వారిని తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇప్పటికైనా మనసు మార్చుకొని ఆడబిడ్డలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం'' అని   వంగలపూడి అనిత అన్నారు.
 

click me!