నారాయణ అరెస్ట్.. తెరపైకి ఫోన్ల ట్యాపింగ్ వివాదం, అలా అనలేదు: మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

By Siva KodatiFirst Published May 12, 2022, 2:36 PM IST
Highlights

పదో తరగతి పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేరస్తులను పట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఫోన్ల ట్యాపింగ్ (phone tapping) వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) స్పందించారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తాను చెప్పలేదని.. ట్రాకింగ్ చేశారని మాత్రమే చెప్పానని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ కేసులో 60 మందికిపైగా (ssc question paper leak) నిందితులను పట్టుకున్నారని మంత్రి తెలిపారు. ఎవరెవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 

ఆ క్రమంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారని.. ఆ విషయమే తాను చెప్పానని మంత్రి వివరణ ఇచ్చారు. టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) వయసుకు తగ్గట్లుగా ఆలోచనతో మాట్లాడటం లేదని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు (meters for agriculture motor) బిగించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని.. మీటర్లు బిగుస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పారదర్శకత కోసమే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తోందని.. ఈ నెలాఖరులోగా రైతుల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి అనుసంధానిస్తారని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వంద శాతం కరెంటు బిల్లుల మొత్తాన్ని రైతుల అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేస్తుందని.. రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారని చెప్పారు . మీటర్లు సక్సెస్ అయితే రైతులు తనకు ఓట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారని.. అందుకే రైతులను రెచ్చగొడుతున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు భాషను తాను మాట్లాడలేనని చురకలు అంటించారు.

కాగా.. పదో తరగతి పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ (narayana arrest) వ్యవహారం ఏపీలో కొత్త వివాదానికి దారితీసింది. ఏపీలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ .. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకూ 60 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. దీనిపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి.. నిజమైన బాధ్యులను అరెస్టు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని పెద్దిరెడ్డి వెల్లడించారు.
 

click me!