వంశీ ఎఫెక్ట్: దేవినేని వర్సెస్ దేవినేని, గద్దె కూడా!

By telugu teamFirst Published Nov 2, 2019, 2:50 PM IST
Highlights

గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండడంతో చంద్రబాబు కు మరో తలపోటు మొదలయ్యింది. కృష్ణ జిల్లా కీలకనేతలు తమ పలుకుబడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. 

గన్నవరం: కృష్ణ జిల్లా రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లడం ఖచ్చితం అని తేలడంతో, జగన్ పెట్టిన కండిషన్ కు అనుగుణంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం ఉపఎన్నిక ప్రతిపక్ష టీడీపీకి ఒక సవాల్ గా మారింది. 

అధికార వైసీపీ మరోసారి టికెట్ ను గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన  యార్లగడ్డకే కేటాయించనున్న నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. టీడీపీ విషయంలో అలా కాదు. కొన్ని సంవత్సరాలుగా వల్లభనేని వంశీ అక్కడి నుండి పోటీ చేసి గెలుస్తున్నారు. అది ఒక రకంగా తన కంచు కోటగా మార్చుకున్నాడు. అందువల్ల అక్కడ ఎప్పుడు కూడా రెండో తరం నేతలను టీడీపీ తాయారు చేయలేదు. 

Also read: దేవినేని ఉమతో వల్లభనేని వంశీకి విభేదాలు: చంద్రబాబు లేఖలో ప్రస్తావన

ఇప్పుడు వంశీ బయటకు వెళ్లడంతో ఎవరిని అక్కడి నుండి బరిలోకి దింపాలని టీడీపీ మల్ల గుల్లాలు పడుతుంది. అక్కడ బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతనే దింపాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ నియోజకవర్గం నుండి ఎవరు బలమైన అభ్యర్థి లేకపోవడంతో, బయట నుండి ఎవరినైనా పోటీకి దించే యోచనలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 

ఇప్పుడు బరిలోకి దింపే అభ్యర్థికి అంగ బలం, అర్థ బలం రెండూ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ నేపథ్యంలో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. మొదటగా వినబడుతున్న పేరు గద్దె అనురాధ. ఈ మీ ప్రస్తుత కృష్ణ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె భర్తకు గన్నవరం తో ఉన్న సంబంధం, పరిచయాల దృష్ట్యా తనకు టికెట్ కేటాయించాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది. ఆర్థికంగా కూడా మంచి స్థితిమంతురాలవడంతో ఆమె పేరును కూడా పరిశీలిస్తున్నారు చంద్రబాబు. 

ఇక పరిశీలనలో ఉన్న మరోపేరు దేవినేని ఉమ. మొన్నటి ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మైలవరం గన్నవరం నియోజకవర్గానికి ఆనుకొని ఉండడం వల్ల తనకు అక్కడ పరిచయాలు కూడా ఉండడం వల్ల అధిష్ఠానం ఈయన పేరును కూడా పరిశీలిస్తుంది. 

Also read: video news : YS Jaganకి వల్లభనేని వంశీ బాధితుడి వీడియో

ఇక మూడవ పేరు మరో దేవినేనిది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కోడలి నాని పై పోటీ చేసి ఓటమి చెందాడు. యువకుడవ్వడం వల్ల ఇతనివైపు చంద్రబాబు ఒకింత మొగ్గు చూపెడుతున్నట్టు తెలుస్తోంది. 

దానికి తోడు గుడివాడ కూడా గన్నవరానికి పక్కనే ఉండడం తో ఆ విషయం కూడా టీడీపీ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అంతేకాకుండా, తెలుగు యువత అధ్యక్షుడవ్వడం వల్ల అక్కడి యువతతో అవినాష్ కు ఉన్న సంబంధాల దృష్ట్యా కూడా అవినాష్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ నడిచినప్పటికీ తట్టుకుని మరీ గెలుపొందారు వల్లభనేని వంశీమోహన్. దాంతో ఉపఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ప్రభావం కూడా కాస్త కనిపించే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో వైసీపీకి ఉపఎన్నికలో గెలుపు పార్టీ పనితీరుకు రెఫరెండంగా భావిస్తే ఓటమి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంది.

click me!