
విజయవాడ: బిజినెస్ వ్యవహారాల్లో తలెత్తిన వివాదం ఇద్దరు భాగస్వాముల ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. రూ.15కోట్లు మోసం చేయడమే కాదు చివరకు ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడలేదు. ఇలా బీర్ బాటిల్స్ తో దాడిచేసి ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నరేంద్రపై హత్యాయత్నానికి పాల్పడిన దారుణం ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... విజయవాడ పట్టణంలో ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ ను నరేంద్ర, మనోహర్, వెంకటేశ్వర రావు కలిసి ఏర్పాటుచేసారు. అయితే కొంతకాలం అంతా సాఫీగానే సాగగా ఇటీవల భాగస్వాముల మధ్య తేడాలు వచ్చాయి. హోటల్ నిర్వహణలో తనకు మనోహర్ రూ.15కోట్లు మోసం చేసాడని నరేంద్ర ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వైరం పెరిగి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంది.
Video
ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ పేరును తొలగించాలంటూ కొంతకాలంగా మనోహర్ బెదిరిస్తున్నాడని నరేంద్ర పేర్కొన్నాడు. అతడి మాట వినకపోవడంతో తాజాగా హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ అతడు పోలీసులను ఆశ్రయించాడు.
సోమవారం రాత్రి రెస్టారెంట్ ను మూసేసి బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తలు నరేంద్రను ఫాలో అయ్యారు. అశోక్ నగర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే ఒక్కసారిగా బీర్ బాటిల్ తో దాడికి తెగబడ్డారు. అయితే ఈ దాడిలో నరేంద్ర తృటిలో తప్పించుకోగా వర్కింగ్ పార్టనర్ వెంకటేశ్వర రావు కు బీర్ బాటిల్ తగిలాయి. దీంతో అతడి తలకి బలమైన గాయమైంది. వెంటనే అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.
అయితే తమపై దాడిచేయించి హత్యాయత్నానికి పాల్పడింది ఆంజనేయ రెస్టారెంట్ యజమాని జూలపల్లి మనోహర్, అతని స్నేహితుడు వేగె వెంకటేశ్వరరావు లే అని నరేంద్ర ఆరోపించాడు. వీరిపై పెనమలూరు పోలీస్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసాడు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నరేంద్ర పోలీసులను కోరాడు. ఈ హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.