జగన్ సర్కార్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు

By Arun Kumar PFirst Published Jun 16, 2022, 10:33 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు వైసిపి ప్రభుత్వ పాలనపై కేంద్ర మంత్రి మురుగన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ, దిశ యాప్ పనితీరును మంత్రి అభినందించారు. 

కాకినాడ: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో వున్న కేంద్ర సమాచార ప్రసార, మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ వైసిపి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ ను కేంద్ర మంత్రి స్వయంగా పరిశీంచారు. దిశ యాప్ ను ఉపయోగించిన క్షణాల వ్యవధిలోనే ప్రమాదంలో వున్న మహిళల రక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం చాలా మంచి చర్యగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

బుధవారం కాకినాడ పట్టణంలోని వివిధ డివిజన్లలో పర్యటించిన కేంద్ర మంత్రి మురుగన్ వైసిపి సర్కార్ ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థను పరిశీలించారు. 36 డివిజన్ లోని సచివాలయంలో విధుల్లో వున్న మహిళా పోలీస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా దిశ యాప్ గురించి మహిళా పోలీస్ మంత్రికి వివరించారు. దీంతో ఈ యాప్ పనితీరును పరిశీలించాలని భావించిన మంత్రి మహిళా పోలీస్ ఫోన్ నుండి ఎస్‌వోఎస్‌ బటన్ నొక్కారు. కేవలం సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్ రూం నుండి స్పందన రావడంతో మంత్రి మురుగన్ యాప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసారు. 

Latest Videos

Video

మహిళల రక్షణకు దిశ యాప్ రూపొందించడంతో పాటు ప్రత్యేకంగా కంట్రోల్ రూం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది కేటాయించడం అభినందనీయమన్నారు. జగన్ సర్కార్ మహిళల రక్షణ కోసం తీసుకున్న చర్యలు చాలా బాగుతున్నాయని కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకునేలా, ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా అందేలా ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ కూడా బాగుందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. ప్రతి డివిజన్ కో సచివాలయం, నిర్ణీత సంఖ్యలోని ప్రజలకు సేవలందించేందుకు వాలంటీర్ నియామకం తదితర ఏర్పాట్లు బాగున్నాయని కేంద్ర మంత్రి మురుగన్ ప్రశంసించారు. 

దిశ బిల్లు: 

ఏపీలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు దిశ పేరిట ఏపీ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ దిశ బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు.  

మహిళలు, చిన్నారులకు పోషకాహారం, సంక్షేమం అందించడంతో పాటు వారికి భద్రత కల్పించడం కూడా అత్యవసరమని... అందుకే వారికి భరోసాతో కూడిన భద్రతను అందించడం కోసమే దిశ బిల్లు, దిశ  యాప్ తీసుకువచ్చినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. 

  ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు, సత్వర స్పందన కోసం హెల్ప్ డెస్కులు ఈ దిశ బిల్లు ద్వారా మహిళలకు అందుబాటులోకి తెచ్చామని జగన సర్కార్ చెబుతోంది. అయితే దిశ చట్టం ఇంకా అమలులోకి రాకముందే మహిళల భద్రత కోసం వైసిపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిశ కార్యాచరణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. దిశ యాప్, దిశ కమాండ్ కంట్రోల్, దిశ ఇన్వెస్టిగేషన్ వెహికిల్, దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లకు 4 స్కోచ్ అవార్డులు కూడా లభించాయి. 

కాబట్టి వీలైనంత త్వరగా ఈ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు అందించాలని సీఎం జగన్ ఇటీవల కేంద్రమంత్రి స్మృతీ ఇరానీని విజ్ఞప్తి చేశారు. 

click me!