
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకాల్లో అవినీతి చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ నియామకాల్లో ఓ స్కామ్ తాజాగా తెరమీదకు వచ్చింది. ఓ కేంద్రమంత్రి పేరును ఆయన అనుమతి లేదా ప్రమేయం లేకుండా వినియోగించినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును ఉపయోగించి ఓ వ్యక్తికి బోర్డులో పదవి ఇచ్చినట్టు తేలింది. ఈ విషయం బయటికి పొక్కడం తీరా అది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెవిన పడటంతో ఇప్పుడు తెరమీదకు వచ్చింది. తన పేరును దుర్వినియోగం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇందులో వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో వైసీపీతోపాటు బీజేపీ నేతల పాత్ర కూడా ఉన్నట్టు బీజేపీ అధిష్టానానికీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు టీటీడీ చుట్టూ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతున్నది. వైసీపీ అధికారంలోకి రాగానే టీటీడీ బోర్డులో సభ్యుల సంఖ్యను 18 నుంచి తొలుత 37కి పెంచింది. ఇప్పుడు దాన్ని ఏకంగా 81 పెంచేసింది. దీనిపై ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి నిర్ణయాధికారం లేకున్నా, కనీసం పాలక మండలి సమావేశాల్లోనూ పాల్గొనలేని ప్రత్యేక ఆహ్వానితుల పదవిని సృష్టించడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బోర్డు నిర్ణయాల్లో వీరి ప్రమేయమేమీ ఉండదు కానీ, అసలైన సభ్యుల ప్రొటోకాల్ వర్తింపజేయడంపైనా చర్చజరిగింది.
ఇటీవలే ఈ జంబో బోర్డును వెంటనే రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. పవిత్ర క్షేత్రాన్ని వ్యాపారస్థలంగా మార్చవద్దని చంద్రబాబు సీఎం జగన్‌కు ఓ లేఖ రాసి నిరసించారు. అందులోనూ అవినీతిపరులు, కళంకితులు, నేరస్తులకు చోటుకల్పించడాన్ని తీవ్రంగా ఖండించారు.