నాయకులు, దేవాలయాలపై వరుస దాడులు... కేంద్ర హోంమంత్రికి టిడిపి ఎంపీల ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Feb 3, 2021, 12:26 PM IST
Highlights

 ఇవాళ(బుధవారం) సాయంత్రం 4గంటలకు అమిత్ షాని కలవనున్నారు టీడీపీ ఎంపీలు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష టిడిపి నాయకులపై జరుగుతున్న వరుస దాడులు, హిందూ దేవాలయాలపై దాడులతో పాటు పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు టిడిపి ఎంపీలు సిద్దమయ్యారు. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలనుకున్న ఎంపీల ప్రయత్నం ఫలించి ఆయన అపాయింట్ మెంట్ లభించింది. దీంతో ఇవాళ(బుధవారం) సాయంత్రం 4గంటలకు అమిత్ షాని కలవనున్నారు టీడీపీ ఎంపీలు.

 పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే టిడిపిలోని కీలక నాయకులపై బౌతిక దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి. వైసిపి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడంటూ ఏకంగా తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. 

ఇక మరో కీలక నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ పై అయితే బౌతిక దాడి జరిగింది.  హైకోర్టు జడ్జిలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివాసం ఉండే విజయవాడలోని భరత్‌నగర్‌లోనే ఆయనపై దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయనపై దాడి జరగడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

read more  పట్టాభిపై దాడి: పొలీసుల అదుపులో కొక్కిరిగడ్డ జాన్ బాబు, అతనిపై 180 కేసులు

ప్రొద్దుటూరులో టీడీపీ చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను పట్టపగలు ఇళ్ల స్థలాల ప్రాంగణంలోనే హత్య చేశారు. అలాగే రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ గురుప్రతాప్‌రెడ్డిని గ్రామసభ జరిగిన దేవాలయంలోనే హతమార్చారు. చిత్తూరు జిల్లా యాదమర్రి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు రాజ నరసింహులు (దొరబాబు) అభ్యర్థులతో సహా ఎంపీడీవో కార్యాలయానికి వెళుతుంటే కారును ధ్వంసం చేశారు.  

ఇక తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్‌గా నామినేషన్‌ వేస్తున్న తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్‌రెడ్డిని జనవరి 30న కిడ్నాప్‌ కు గురయ్యాడు. వాళ్ల చెర నుంచి బయటపడిన శ్రీనివాస్‌రెడ్డి తన భార్య నామినేషన్‌ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లిన శ్రీనివాసరెడ్డి అదేరోజు పొలంలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోవడం సందేహాస్పదం. కక్షగట్టి శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రించారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు టిడిపి ఎంపీలు సిద్దమయ్యారు.
 

 

click me!