విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ తేల్చి చెప్పారు.వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ తేల్చి చెప్పారు.వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని మంత్రి ఈ సమాధానంలో చెప్పారు. స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ పరిశ్రమలను కూడ ప్రైవేటీకరించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.నవరత్న సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వాణిజ్య, ఆర్ధిక లావాదేవీలను చేస్తోందన్నారు.
గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాచ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలను కోరినట్టుగా ఆ సమాధానంలో మంత్రి గుర్తు చేశారు. ఇదే విషయమై కేంద్ర ఉక్కు శాఖకు కూడ స్టీల్ ప్లాంట్ లేఖ రాసిందన్నారు.ప్రత్యేకంగా ఓ బ్లాక్ ను కేటాయించాలని కేంద్ర ఉక్కు శాఖ ఒడిశా ప్రభుత్వాన్ని కోరిందని మంత్రి తెలిపారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు.ఈ పోరాటానికి రాజకీయ పార్టీలు కూడ సంఘీభావం తెలిపాయి. కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గడం లేదు.