లిక్కర్ కింగ్, స్టిక్కర్ కింగ్.. జగన్‌కు కావాల్సింది జీఎస్టీ కాదు, జేఎస్టీ : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Siva Kodati |  
Published : Aug 21, 2022, 03:12 PM IST
లిక్కర్ కింగ్, స్టిక్కర్ కింగ్.. జగన్‌కు కావాల్సింది జీఎస్టీ కాదు, జేఎస్టీ : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పెట్రోల్‌పై పన్నుల‌ భారాలను జగన్ తగ్గించ లేదని.. జగన్‌కు జీఎస్టీ కన్నా జేఎస్టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి అని ఆయన చురకలు వేశారు. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ కూడా అంటూ కేంద్ర మంత్రి సెటైర్లు వేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ను వ్యతిరేకించి యువకులు జగన్ కు అండగా నిలిచారని, కానీ ఆయన యువతని అన్ని విధాలా మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన యువతే ఇప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని.. ఉన్న పరిశ్రమలను కూడా తరలించే విధంగా జగన్ పాలన సాగిందని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు... ‌ఏది మా జాబు అని గతంలో ప్రశ్నించామని, ఇప్పుడు జగన్ బాబూ.. ఏది మా జాబు అని నిలదీస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాలు ఏపీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం వస్తుంది.. ఈ మాఫియాల ఆట కట్టిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో డ్రగ్ మాఫియాలో కేజ్రివాల్ పాత్ర ఉందని.. లిక్కర్ మాఫియాతో ఏపీ  ప్రభుత్వానికి లింకు ఉందని అనురాగ్ ఆరోపించారు. అవి త్వరలోనే బయటకొస్తాయని, చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి హెచ్చరించారు. 

గంజాయి మాఫియాతో ఏపీలో యువత నిర్వీర్యం అయిపోతుందని.. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా మేల్కోవాలని, గంజాయి రవాణాని అరికట్టాలని అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని యువత జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. యువత నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా జగన్ పాలన ఉందని.. గంజాయి ముఠాలను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అవినీతి జరిగే రాష్ట్రాల్లో ఏపీ నాలుగో ర్యాంకు, తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 

కేసిఆర్, జగన్మోహన్ రెడ్డిలు అవినీతిలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాష్ట్రంలో అనేక మాఫియాలు రెచ్చిపోతున్నా... జగన్ కళ్లు మూసుకుని పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికి మంచినీరు పథకాన్ని మోడీ అమలు చేస్తున్నారని.. కుళాయిలకి 4500 కోట్లు మోడీ ఇస్తే... కేవలం 4 కోట్లు జగన్ కేటాయించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. 

రూ.45,000 వేల కోట్లు ఆరోగ్యం కోసం ఇస్తే.. జగన్ రూ.450 కోట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగినా జగన్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాలను ఎలా రక్షించాలో చేసి చూపిస్తామని అనురాగ్ ఠాకూర్ సూచించారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ రాయలసీమ నుంచే సిఎంలుగా అయ్యారని.. అయినా ఆ ప్రాంతంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉద్యోగాలుండవ్, నీళ్లు లేవు... ఆ ప్రాంతాలను ఎందుకు పట్టించుకోలేదని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్ లను మోడీ ఏపీకి ఇచ్చారని, కేంద్రం నుంచి వేల‌ కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. కేంద్రం చేసిన అభివృద్ధి, ఏపీకి చేసిన సాయం పై ప్రజల్లోకి వెళ్లి వివరించాలని, బీజేపీకి అధికారం ఇస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చి చూపిస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కోసం మోడీ వందల కోట్లు నిధులు ఇచ్చారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. 

మోడీ ఏపీకి 21 లక్షల ఇళ్లు కేటాయించినా..‌  ఇంతవరకు జగన్ పేదలకు అప్పగించ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోనే ప్రజల సమస్యలను పట్టించుకోని జగన్.. రాష్ట్ర ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని అనురాగ్ ఠాకూర్ నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినా... అభివృద్ధి మాత్రం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పిన జగన్ మూడు రాజధానులు పేరుతో నాశనం చేశారని అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రాజధానికే డబ్బు లేదని.. మూడు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 

పెట్రోల్‌పై పన్నుల‌ భారాలను జగన్ తగ్గించ లేదని.. జగన్‌కు జీఎస్టీ కన్నా జేఎస్టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి అని ఆయన చురకలు వేశారు. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ కూడా అంటూ కేంద్ర మంత్రి సెటైర్లు వేశారు. మోడీ అమలు చేసే పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని.. భూ మాఫియా, మద్యం మాఫీయాను తరమికొట్టే విధంగా అందరూ కలిసి పని చేయాలని అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!