విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: అది ‘‘ రహస్యం’’.. ఆ వివరాలు చెప్పలేం, తేల్చిచెప్పిన కేంద్రం

By Siva KodatiFirst Published Jun 15, 2021, 5:58 PM IST
Highlights

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా ఏపీలో ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఆందోళన నిర్వహిస్తున్నాయి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని నెలలుగా ఏపీలో ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఆందోళన నిర్వహిస్తున్నాయి. కోవిడ్‌ విజృంభణతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన కార్మిక సంఘాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. దీనిలో భాగంగా యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.  ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు కేంద్ర ఆర్థికశాఖ నిరాకరించింది.

ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్‌ అడిగిన సమాచారం ఇచ్చేందుకు విత్త మంత్రిత్వ శాఖ అంగీకరించలేదు. ‘ఉక్కు’లో పెట్టబడులు ఉపసంహరణ అంశం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8ఎ ప్రకారం ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని ఆర్థికశాఖ తెలిపింది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో.. ఆర్థికశాఖ డీఐపీఏఎంకు సూచించింది. అయితే ఆర్‌ఐఎన్‌ఎల్‌ విక్రయంపై సమాచారం గోప్యమని పేర్కొంటూ పీఎంవో ఆదేశాలను ఆర్థికశాఖ డీఐపీఏఎం తిరస్కరించింది. 

Also Read:ఈ నెల 29న సమ్మె: నోటీసిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు

కాగా, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర కేబినెట్‌ సిఫారసు చేసింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆర్ఐఎన్ఎల్‌లో నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని తేల్చిచెప్పారు. 

అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఒక్క బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని ఉద్యమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలవల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో కొనసాగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటీకరణను నిరసిస్తూ న్యాయస్థానాల్లో పలువురు వ్యాజ్యాలు సైతం దాఖలు చేశారు. 

click me!