ఏపీలో కరోనా కలకలం... మరో ఎమ్మెల్యేకు పాజిటివ్

By Arun Kumar PFirst Published Apr 11, 2021, 8:28 AM IST
Highlights

కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న టిడిపి ఎమ్మెల్యే మంతెనకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకున్న ఆయనకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో ఇటీవలే ఎమ్మెల్యే రామరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే తాజాగా కరోనా సోకినందును తనను కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోవాలని రామరాజు సూచించారు. 

read more   టీకా ఉత్సవం : ప్రధాని మోదీకి జగన్‌ లేఖ.. ఏపీకి 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు...

ఇదిలావుంటే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలతో పోటీనిచ్చేలా ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,309 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 9,21,906కి చేరుకుంది. కోవిడ్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,291కి చేరింది.

చిత్తూరులో ముగ్గురు, నెల్లూరు ఇద్దరు, విశాఖపట్నం ఇద్దరు, శ్రీకాకుళం ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పన ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,053 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 8,95,949కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,666 యాక్టీవ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజు  31,929 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు  నిర్వహించగా.. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,53,97,672కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 133, చిత్తూరు 740, తూర్పుగోదావరి 111, గుంటూరు 527, కడప 124, కృష్ణ 278, కర్నూలు 296, నెల్లూరు 133, ప్రకాశం 174, శ్రీకాకుళం 279, విశాఖపట్నం 391, విజయనగరం 97, పశ్చిమ గోదావరిలలో 26 కేసులు నమోదయ్యాయి. 
 

click me!