
న్యూఢిల్లీ: రష్యా(Russia) బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతుండగా ఉక్రెయిన్(Ukraine)లో చిక్కుకున్న వారు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవడం చాలా క్లిష్టంగా మారింది. అక్కడి నుంచి అన్ని దేశాలు తమకు వీలైన రీతిలో పౌరులను వెనక్కి(Evacuation) రప్పించుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు వారు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరులను దాని పొరుగు దేశాల సరిహద్దులకు పంపి అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తున్నది. ఈ ప్రక్రియ చెప్పుకున్నంత సులువుగా లేదు. ఉక్రెయిన్‌లో వారు నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలి వెళ్లిపోవడం కత్తిమీద సాములా ఉన్నది. ఏ క్షణాన ఎక్కడి నుంచి క్షిపణి వచ్చి పడి భస్మం చేస్తుందో తెలియని దుస్థితి. అప్పుడప్పుడు ఆ దేశ పౌరులు, పోలీసుల నుంచీ పౌరులకు సహకారం అందకపోవడం పరిస్థితులను మరింత దుర్భరం చేస్తున్నాయి. అయితే, ఈ తరలింపుల గురించి ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన సాగరిక చౌదరి మాట్లాడారు. ఆమె ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి రావడానికి ఎన్ని గడ్డు సవాళ్లను ఎదుర్కొన్నారో ఏకరువు పెట్టారు.
ఉక్రెయిన్ ఎల్వివ్‌లోని ఇవాన్ ఫ్రాంకో నేషనల్ యూనివర్సిటీలో సాగరిక ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ కాలంలో ఉన్నట్టుండి రష్యా.. తాను చదువుతున్న దేశంపై యుద్ధం ప్రకటించింది. చదువుకుంటున్న యూనివర్సిటీలు స్వదేశానికి వెళ్లితే ఆన్‌లైన్‌లో కోర్సులు కొనసాగిస్తామనే హామీ ఇంకా రాలేదు. కానీ, అప్పటికే సమయం మించి పోయింది. రష్యా సైనిక చర్యతో సాగరిక వెనుదిరగక తప్పలేదు. ఆమె తరహాలోనే ఎందరో మంది భారతీయ విద్యార్థులు తిరిగి భారత్‌కు రావడానికి బయల్దేరారు. ఉక్రెయిన్, స్లొవేకియన్ సరిహద్దు దాటడానికి పోలీసులు వారించడంతో వారిలో చాలా మందికి అసహనం పెరిగిపోయింది. సుమారు 48 గంటలు ఎదురుచూసినా వారు సరిహద్దు దాటడానికి అనుమతించలేదు. దీంతో వారిలో చాలా మందికి కోపం వచ్చింది. వారిని అడ్డుకుంటున్న పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారని, దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు తమపై పెప్పర్ స్ప్రే వినియోగించారని సాగరిక తెలిపారు. సూప్‌ల, బిస్కెట్లపై ఆధారపడి ఆకలిని అణచుకున్నామని వివరించారు. కేవలం ఉక్రెయిన్ మహిళలలు, పిల్లలను మాత్రమే సరిహద్దు దాటడానికి పోలీసులు అనుమతించారని వివరించారు. స్లోవేకియా దేశ సరిహద్దు వెంట ఉక్రెయిన్ నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ పోయిందని, సరిహద్దు వెంట వారి బారులు పాముల వలే మారాయని తెలిపారు.
ఫిబ్రవరి 27వ తేదీన ఇతర విద్యార్థులతో కలిసి సాగరిక ఎల్వివ్ వదిలి స్లోవేకియా సరిహద్దు వైపునకు బయల్దేరారు. స్థానిక ఎయిర్‌పోర్టును రష్యా సేనలు ధ్వంసం చేసిన తర్వాత వారు ఓ క్యాబ్ మాట్లాడుకుని సరిహద్దుకు చేరుకోగలిగారు. బార్డర్ చేరడానికి తమకు 12 గంటలు పట్టిందని, నిజానికి ఈ సరిహద్దు వెళ్లడానికి సాధారణంగా ఐదు గంటల సమయం పట్టేదని తెలిపారు. అందరూ బార్డర్ వైపు బయల్దేరడంతో కార్లు బారులు తీశాయని, ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా తన ప్రయాణం చాలా లేట్ అయిందని వివరించారు. తొలుత 80 మంది విద్యార్థులను స్లోవేకియాలోకి ప్రవేశించడానికి అనుమతించారని, తమ బృందాన్ని వారు అడ్డుకున్నారని, ఆ సరిహద్దు దాటడానిక తాము 48 గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ ఎంబీబీఎష్ డిగ్రీ కాదంటే.. మళ్ీల ఉక్రెయిన్ వెళ్లే ఆలోచనలే లేవని వివరించారు. గత రెండు మూడు వారాలుగా అక్కడి పరిస్థితులను జ్ఞప్తికి వస్తే కంట నీరు ఆగదని పేర్కొన్నారు.