ఏపీ రాజధాని హైదరాబాదే... అందుకే హైకోర్టు తీర్పు అలా వచ్చింది..: మంత్రి బొత్స సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Mar 07, 2022, 05:09 PM ISTUpdated : Mar 10, 2022, 04:27 PM IST
ఏపీ రాజధాని హైదరాబాదే... అందుకే హైకోర్టు తీర్పు అలా వచ్చింది..: మంత్రి బొత్స సంచలనం

సారాంశం

మరో రెండేళ్లు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదేనని... దీన్ని దృష్టిలో వుంచుకునే ఇటీవల హైకోర్టు రాజధానిపై తీర్పు ఇచ్చి వుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ (ap budget session) సమావేశాల ప్రారంభంరోజునే గవర్నర్ (ap governor) ప్రసంగ సమయంలో టిడిపి (TDP) సభ్యులు అసెంబ్లీలో గందరగోళం సృష్టించడంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) సీరియస్ అయ్యారు. పవిత్రమైన అసెంబ్లీలోనే గవర్నర్ పై టీడీపీ సభ్యుల దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీకి హాజరుపై టీడీపీకి నిర్దుష్టమైన విధానం లేదు... అందుకే సానుభూతి డ్రామాలు ఆడుతోందని మంత్రి బొత్స ఆరోపించారు. 

''అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. దాదాపు 1.32 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు చేరవేయడం జరిగిందని చెప్పారు. దురదృష్టం ఏమిటంటే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ దుర్బుద్ధితో సభలో వ్యవహరించిన తీరును కూడా రాష్ట్ర ప్రజలంతా చూశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ను దూషిస్తూ సభలో టీడీపీ సభ్యులు చేసిన నినాదాలు... వారు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి పునరావృత్తం కాకూడదని కోరుతున్నాం'' అని బొత్స పేర్కొన్నారు. 

''అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై టిడిపికి ఒక విధానం అంటూ లేదు. క్షణికావేశంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అమలు చేసే సమయంలో తిరిగి ఆలోచనలో పడిపోతారు. వారివి వ్యక్తిగత స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు తప్పితే అందులో ప్రజా ప్రయోజనాలు లేవు.  మళ్ళీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుని ఏదో ఉద్దరించటానికి చేస్తున్నట్టు... తద్వారా సానుభూతి పొందాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీకి ఒక నిర్దుష్టమైన విధానం అంటూ లేదు. ఎంతసేపటికీ తమ స్వార్థం కోసం తప్ప ప్రజా ప్రయోజనాలకోసం గానీ, సమిష్టి నిర్ణయాలు, సమిష్టి అభిప్రాయాలు గానీ ఆ పార్టీకి లేవు'' అని మండిపడ్డారు.

''టిడిపి చీఫ్ చంద్రబాబు స్వార్థం కోసం, ఆ పార్టీ పెద్దలు దోచుకోవడానికి మాత్రమే అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. సమిష్టి నిర్ణయాలు ఆ పార్టీలో ఉండవనేదానికి అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వారి కుప్పిగంతులే ఉదాహరణ. ఎప్పుడైనా, ఎక్కడైనా దీర్ఘకాలిక ఆలోచనలు, విశాలమైన దృక్పథం కలిగిన పార్టీల వల్లే ప్రజలకు మేలు జరుగుతుంది'' అన్నారు.

''ముడు రాజధానుల బిల్లుపై ఏం జరుగుతుందో వేచి చూడండి. తొందరెందుకు..?. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేత చట్టాలు చేయడానికే శాసనసభ, పార్లమెంటు ఉన్నాయి. రాజ్యాంగానికి లోబడే అవి చట్టాలు చేస్తాయి. చట్టాలు చేయకూడదు, న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకూడదంటే ఎలా..? ఎవరి పరిధులు వారికి ఉంటాయి. న్యాయస్థానాలపై అపారమైన గౌరవం, నమ్మకం ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్నాయి'' అని పేర్కొన్నారు

''2014 విభజన చట్టంలో పదేళ్ళపాటు అంటే 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. విభజన చట్టం అమలు మీద కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఆ కమిటీ విస్తృతస్థాయిలో పర్యటించి, అధ్యయనం చేసి కేంద్రానికి కొన్ని సూచనలు ఇచ్చింది.  దురదృష్టవశాత్తు వాటిలో చంద్రబాబు ఒక్క సూచనగానీ, సలహాగానీ తీసుకోలేదు. అందులో ఒక సూచన వికేంద్రీకరణ కూడా. వికేంద్రీకరణ వల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందన్న సూచనను అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు'' అని తెలిపారు. 

''చంద్రబాబు ఆదరాబాదరగా నాలాంటి ఒక మంత్రిని ఛైర్మన్ గా పెట్టి కమిటీ వేసారు. వారి  సూచనలు, సలహాల మేరకు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. వీళ్ళు చేసిన తీర్మానాన్ని ఢిల్లీకి, పార్లమెంటుకు పంపారా? వాళ్ళ అనుమతి పొందారా? ఏమైనా చట్టపరంగా చేశారా? అంటే ఏమీ చేయలేదు. 2024 వరకు మన రాజధాని ఏదంటే హైదరాబాదే.  దాన్ని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు అలా మాట్లాడి ఉండవచ్చు'' అన్నారు.  

''రాజధానులు అనేవి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య పట్టణాలు గుర్తించడానికి. ఎగ్జిక్యూటివ్ రాజధాని, పరిపాలన రాజధాని, న్యాయ రాజధానులను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ ఆలోచన, విధానం. మరోవైపు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను కూడా విస్తరిస్తున్నాం. మ్యానిఫెస్టోలో మేం ఇచ్చిన ఆ  హామీలు చూసే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారు. మా ప్రభుత్వ ఆలోచన, మా పార్టీ విధానం ప్రకారం.. అమరావతి శాసన రాజధాని మాత్రమే'' అని మంత్రి బొత్స స్ఫష్టం చేసారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu