ఏపీ కేబినెట్ భేటీ‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Published : Mar 07, 2022, 05:05 PM IST
ఏపీ కేబినెట్ భేటీ‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ సమావేశమైంది. కేబినెట్‌ భేటీ ప్రారంభానికి ముందు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి సీఎం జగన్, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఇక, 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ అధికారిక భాషా చట్టం 1966 సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్‌ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణ ఇది. డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టును జాయింట్‌ కంట్రోలర్‌(అడ్మిన్‌) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1234 కోట్ల రూపాయిలతో మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం చేపట్టనున్నారు. 

స్టేట్‌ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. 

165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటైనెన్స్‌ కోసం రూ. 75.24 కోట్లు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌– బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu