అన్న కోసం ఫైట్ చేశా.. చివరికి వాళ్లు కూడా అధికారం కోసమే : మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 31, 2023, 6:35 PM IST
Highlights

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తన కోసం ఏదో ఒకటి చేస్తానని మాట ఇచ్చారని.. కానీ నాలుగున్నరేళ్లు పదవి వుండగానే ఎమ్మెల్యేగా రాజీనామా చేశానని ఆయన గుర్తుచేశారు. 

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ సారి సొంత కుటుంబంపైనే ఆయన విమర్శలు గుప్పించారు. అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి కోసం తాను అందరితో ఫైట్ చేశానని.. కానీ నేడు వాళ్లు కూడా అధికారం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. తమ అధికారం పోతుందేమోనని అనుకుంటున్నారని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తన కోసం ఏదో ఒకటి చేస్తానని మాట ఇచ్చారని.. కానీ నాలుగున్నరేళ్లు పదవి వుండగానే ఎమ్మెల్యేగా రాజీనామా చేశానని చంద్రశేఖర్ రెడ్డి గుర్తుచేశారు. 

దీనికి మేకపాటి విక్రం రెడ్డి స్పందించారు. వైసీపీ పార్టీ బ్యానర్, ఇంటి పేరు వదిలితే చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలుస్తుందని బాబాయ్‌కి చురకలంటించారు. మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం జగన్ వెంటే వుంటుందని.. పార్టీ లైన్ దాటితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవని విక్రం రెడ్డి హెచ్చరించారు. జగన్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకే మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల గుండెల్లో జగన్ పదిలంగా వుంటారని విక్రం రెడ్డి పేర్కొన్నారు. 

కాగా.. ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అంతేకాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also REad: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి, సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చొన్న మేకపాటి

ఎవరు పడితే వారు నాయకులు కారని .. ఉదయగిరి తనదేనని, తామే అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత మూలే వినయ్ రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం మేకపాటికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తాము వచ్చే సరికి మేకపాటి వెళ్లిపోయారని, ఆయన అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి అని వారు నినాదాలు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన వద్ద డబ్బులు తీసుకున్నది నిజం కాదా అని మూలే వినయ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పరిణామాలతో పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

మరోవైపు శుక్రవారం కూడా ఉదయగిరిలో సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. బస్టాండ్ సెంటర్‌లో వినయ్ కుమార్ రెడ్డి కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన మేకపాటికి సవాల్ విసిరారు. 

click me!