మణిపూర్ హింస.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇద్దరు ఏపీ విద్యార్ధులు, తాగడానికి నీరు కూడా లేదంటూ ఆవేదన

Siva Kodati |  
Published : May 07, 2023, 09:30 PM IST
మణిపూర్ హింస.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇద్దరు ఏపీ విద్యార్ధులు, తాగడానికి నీరు కూడా లేదంటూ ఆవేదన

సారాంశం

ఇంఫాల్ ఎన్ఐటీలో చదువుకుంటున్న ఇద్దరు ఏపీ విద్యార్ధులు కోల్‌కతాకు చేరుకున్నారు . వీరిని విజయవాడకు చెందిన జయశ్రీ, విశాఖకు చెందిన సంతోషిగా గుర్తించారు.

హింసాత్మక పరిస్ధితుల నేపథ్యంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా మారింది. అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్నిచోట్ల భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో వుంది. మరోవైపు.. మణిపూర్‌లో వున్న ఇతర రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంఫాల్ ఎన్ఐటీలో చదువుకుంటున్న ఇద్దరు ఏపీ విద్యార్ధులు కోల్‌కతాకు చేరుకున్నారు. 

ప్రైవేట్ విమానంలో వీరిద్దరూ ఆదివారం సాయంత్రం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు క్షేమంగా చేరుకున్నారు. వీరిని విజయవాడకు చెందిన జయశ్రీ, విశాఖకు చెందిన సంతోషిగా గుర్తించారు. ఈ సందర్భంగా జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానాలు మణిపూర్‌కు రాలేదన్నారు. తాము మాత్రమే కోల్‌కతాకు చేరుకున్నామని జయశ్రీ చెప్పింది. అక్కడ తమకు తినడానికి తిండి, తాగడానికి నీరు లేదని ఆమె వాపోయింది. తమ స్నేహితులంతా ఇంకా మణిపూర్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జయశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. 

Also Read: మణిపూర్ హింస.. విద్యార్థుల రాక ఆలస్యం, రేపు ఉదయం శంషాబాద్‌కు ప్రత్యేక విమానం..?

మరోవైపు.. మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను వెనక్కి తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంలో కొంచెం ఆలస్యం జరిగిందన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని.. ప్రతి ఒక్క విద్యార్ధిని వెనక్కి తీసుకొస్తామని బొత్స స్పష్టం చేశారు. ముందుగా 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని సత్యనారాయణ తెలిపారు. 

అంతకుముందు మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను రక్షించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంలో వున్న శ్రద్ధ విద్యార్ధులను కాపాడటంలో లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో వున్నా , అధికారంలో వున్నా తెలుగువారి సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తూనే వుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

రంగులు వేసేందుకు, ప్రచారం చేసుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. కానీ ఆపదలో వున్న విద్యార్ధులను ఆదుకోరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరిగే జగన్.. విద్యార్ధుల కోసం ఒక ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. మణిపూర్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను వెంటనే తీసుకురావాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu