వైఎస్ జగన్, చెవిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఈసీకి టీడీపీ ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 6:27 PM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలు  ఒక్కో నియోజకవర్గంలో రూ.20 కోట్లు.. 30 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. వైసీపీ నేతల కదలికలపై ఎన్నికల సంఘం నిఘాపెట్టాలని నర్సింహయాదవ్ కోరారు. 
 

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ కు క్యూ కట్టారు.  ఓటర్ లిస్ట్ నుంచి వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, ఒక్కొక్కరికి మూడేసి ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా ఫిర్యాదులు చెయ్యడం మెుదలు పెట్టేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తుడా ఛైర్మన్‌ నర్సింహయాదవ్‌ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.10కోట్ల విలువైన లక్ష గడియారాలను చెవిరెడ్డి ఓటర్లకు పంపిణీ చేశారని అందుకు సంబంధించి ఆధారాలను కూడా ఎన్నికల అధికారులకు సమర్పించినట్లు నర్సింగ్ యాదవ్ స్పష్టం చేశారు.   

చెవిరెడ్డి ప్రలోభాలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి సభలో ఓటుకు రూ.5వేలు అడగాలని ప్రజలకు సూచించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైఎస్ జగన్‌పై కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఓటు  అమ్ముకోవాలని బహిరంగ వేదికలపై జగన్ చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే అవుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలు  ఒక్కో నియోజకవర్గంలో రూ.20 కోట్లు.. 30 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. వైసీపీ నేతల కదలికలపై ఎన్నికల సంఘం నిఘాపెట్టాలని నర్సింహయాదవ్ కోరారు. 

click me!