శ్రీవారి ఆస్తులను కాజేయడానికి జగన్ సర్కార్ కుట్ర...: టిటిడి మాజీ ఛైర్మన్ సంచలనం

By Arun Kumar PFirst Published Jul 2, 2021, 2:26 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని కాదని స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం వెనుక పెద్దకుట్రేదో ఉందనే అనుమానం కలుగుతోందని టిటిడి మాజీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ సందేహం వ్యక్తం చేశారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ వేయడంలోని మర్మమేంటి? అని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. పాలక మండలిని కాదని అథారిటీని నియమించడం వెనుక పెద్దకుట్రేదో ఉందనే అనుమానం కలుగుతోందని సుధాకర్ యాదవ్ సందేహం వ్యక్తం చేశారు. 

 తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ విక్రయ కౌంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అనేది హిందూభక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు. పవిత్రంగా, నిష్టతో తయారుచేసే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అనేకమంది సిబ్బంది నిత్యం స్వామివారి సేవలో తరిస్తూ, విక్రయకేంద్రాల్లో ఉండి భక్తులకు ఉచితంగా అందిస్తారు. అలాంటి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని బయటి వ్యక్తులకు అప్పగిస్తే స్వామివారి ప్రసాదాన్ని ఇష్టానుసారంగా నచ్చిన ధరలకు అమ్ముకునే అవకాశముందని సుధాకర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. 

శ్రీవారి ప్రసాదానికి ఎంతో విశిష్టత, పవిత్రత ఉందని... దీన్ని మంటగలిపేలా స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రసాద విక్రయాల పేరుతో పెద్దస్కామ్ కు పాల్పడే అవకాశం కూడా ఉందన్నారు పుట్టా. 

read more  ముగిసిన పాలక మండలి గడువు: టీటీడీ పాలన ఇక స్పెసిఫైడ్ అథారిటీ కనుసన్నల్లో

స్వామివారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల తాలూకా సొమ్మును, ఆస్తులను కాజేయడానికే స్పెసిఫైడ్ అథారిటినీ నియమించడం సుధాకర్ ఆరోపించారు. గతంలో పాలకమండలిలోని అధికారులు దోపిడీకి అనుకూలంగా వ్యవహరించడంలేదని, ప్రభుత్వానికి సరిగా సహకరించడంలేదనే వారిని తప్పించి అథారిటీని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.

స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఆస్తులు, ఇతరత్రా విలువైన వస్తువుల స్వాహాకు కుట్ర జరుగుతోందన్నారు. అదేగానీ జరిగితే తిరుమలక్షేత్ర మహత్యంతో పాటు స్వామివారి ఖ్యాతి, విశిష్టత మంటగలిసే అవకాశముందని సుధాకర్ చెప్పారు. హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలను  గౌరవించి ప్రభుత్వం వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని రద్దుచేసి పాలకమండలిని పునర్నియమించాలని టీడీపీ నేత సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు.

click me!