
అమరావతి: కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైసీపీ మొదటి నుంచీ కుట్రలు చేస్తోందని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి యత్నించిన జగన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని పుట్టా ఆరోపించారు.
తాజాగా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గోవధపై వ్యాఖ్యలు చేశారు. తక్షణమే చెన్నకేశవరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పుట్టా సుధాకర్ డిమాండ్ చేశారు.
read more గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలనం
''ఉమ్మడి రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడిన ఘనత చంద్రబాబునాయుడికి దక్కుతుంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా సామరస్యంగా ఉంటున్న మతాల మధ్య వైసీపీ చిచ్చు పెట్టేందుకు యత్నించడం దురదృష్టకరం. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో దేవాలయాలపై సుమారు 200 దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలు జరిగాయి. ప్రభుత్వ అండతోనే అరాచకశక్తులు రెచ్చిపోతున్నాయి'' అన్నారు.
''దేవాలయాల విధ్వంసాలకు పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థంలో రాములు వారి విగ్రహం ధ్వంసం జరిగినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. హిందువులు పవిత్రంగా భావించే గోవు పట్ల ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలి. లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతారు'' పుట్టా సుధాకర్ హెచ్చరించారు.