శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై వివాదం.. ఆడిటర్లతో వచ్చి పరిశీలించుకోవచ్చని టీటీడీ ఈవో సవాలు..!!

Published : Jun 20, 2023, 01:28 PM IST
శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై వివాదం.. ఆడిటర్లతో వచ్చి పరిశీలించుకోవచ్చని టీటీడీ ఈవో సవాలు..!!

సారాంశం

శ్రీవాణి ట్రస్టు నిధులపై వస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి సీరియస్‌గా స్పందించారు. శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నవారికి సవాలు విసిరారు. 

శ్రీవాణి ట్రస్టు నిధులపై వస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి సీరియస్‌గా స్పందించారు. శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నవారికి సవాలు విసిరారు. శ్రీవాణి ట్రస్టు‌కు సంబంధించి ఆరోపణలు చేస్తున్నవారు ఆడిటర్లతో వచ్చిన పరిశీలించుకోవచ్చని  చెప్పారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మంగళవారం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టును 2018లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ఉన్న బోర్డు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అప్పుడు రాజధానిగా అనుకున్న అమరావతిలో టెంపుల్ నిర్మాణం కోసం విరాళాల సేకరణ కోసం ఈ ట్రస్టును ప్రారంభించడం జరిగిందని అన్నారు. తొలుత విరాళాలు తక్కువగా రావడంతో..  రూ. 10 వేల విరాళం ఇచ్చే భక్తులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి వన్ టైమ్ కింద కొన్ని ప్రివిలేజెస్ కల్పించడం జరిగిందని తెలిపారు. 

అయితే 2019కు ముందు ఇక్కడ చాలా మంది బ్రోకర్లు ఇక్కడ పనిచేసేవారని.. తాను ఉరికే ఆరోపణలు చేయడం లేదని, ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పారు. 2019 జూలైలో తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రోకర్లపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు భక్తులు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చి.. దర్శనానికి సంబంధించి ప్రివిలేజెస్ వినియోగించుకున్నారని చెప్పారు. శ్రీవాణి ట్రస్టును నిర్మించిందే ఆలయాలను నిర్మించడానికి అని చెప్పారు. శ్రీవాణి  ట్రస్టుతో బ్రోకర్ల వద్దకు పోయే ఆదాయం తగ్గిందని  అన్నారు. 

ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్టుకు రూ. 860 కోట్లు విరాళాలు వచ్చాయని చెప్పారు. ఈ విరాళాలతో పారదర్శకంగా 2,445 ఆలయాల నిర్మాణం చేపట్టినట్టుగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో దూపదీప నైవేద్యాలకు ప్రతి నెల రూ. 5 వేలు చెల్లిస్తున్నామని  చెప్పారు.  

Also Read: శ్రీవాణి ట్రస్ట్‌పై వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్


ఇక, శ్రీవాణి ట్రస్టు నిధుల దోపిడి  జరుగుతుందంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దాని ఖర్చుపై ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అవసరమైతే బోర్డు న్యాయపరమైన ఆశ్రయం కూడా తీసుకుంటుందని తెలిసింది. సోమవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో టీటీడీ చేస్తున్న కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా వేంకటేశ్వరుని ఆలయాలను నిర్మించాలనే గొప్ప ఉద్దేశ్యంతో శ్రీవాణి ట్రస్టును ప్రారంభించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాలలో ట్రస్టు నుంచి అందిన నిధులతో ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల కాలనీల్లో 2,445 దేవాలయాలను నిర్మించినట్టుగా చెప్పారు. పురాతన దేవాలయాల పునరుద్ధరణకు సహకరిస్తున్నట్టుగా తెలిపారు. అయితే రాజకీయ నేతలు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ‘‘ఆలయ పరిపాలనలో పారదర్శకత మచ్చలేనిది. ట్రస్ట్ కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించబడుతుంది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగానికి అవకాశం లేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత నవంబర్‌లో టీటీడీ స్థిరాస్తులు, బంగారం, ఇతర ఆస్తులపై శ్వేతపత్రం కూడా విడుదల చేసిందని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?