టీటీడీ ఆస్తులను అమ్మడం లేదు... ఎన్ని నిందలు వచ్చినా తట్టుకుంటా: వైవీ సుబ్బారెడ్డి

By Siva KodatiFirst Published May 25, 2020, 6:17 PM IST
Highlights

టీటీడీ ఆస్తుల అమ్మకం ఇప్పుడే  కొత్తగా ప్రారంభించింది కాదన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ ఆస్తుల వేలంపై ఆయన సోమవారం వివరణ ఇచ్చారు

టీటీడీ ఆస్తుల అమ్మకం ఇప్పుడే  కొత్తగా ప్రారంభించింది కాదన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ ఆస్తుల వేలంపై ఆయన సోమవారం వివరణ ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా ఈ విషయంపై వస్తున్న వార్తలు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్నతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. అలాంటివి మానుకోవాలని సుబ్బారెడ్డి హితవు పలికారు.

Also Read:తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం: ప్రత్యామ్నాయాలు ఇవీ....

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పనంగా భూములు ఇచ్చారని వైవీ గుర్తుచేశారు. రాజకీయ వ్యతిరేకతతోనే తమపై నిందలు వేస్తున్నారని.. తాము కేవలం శ్రీవారి సేవకులం మాత్రమేనని ఆయన అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సదావర్తి భూములను కాపాడింది తామేనని వైవీ అన్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే ప్రతి పైసా కాపాడుతున్నామని.. తిరుమల కొండకు తాము సేవకులుగానే వెళ్లామని ఆయన స్పష్టం చేశారు.

పదవి ఉన్న లేకపోయినా శ్రీవారి ఆస్తులను కాపాడుతామన్నారు. గతంలో ఏకంగా 50 ఆస్తుల్ని అమ్మాలని చదలవాడ నిర్ణయించారని.. నిరర్థక ఆస్తుల్ని అమ్మాలని జనవరి 30, 2016న తీర్మానం చేశారని సుబ్బారెడ్డి గుర్తుచేశారు.

Also Read:టీటీడీ ఆస్తుల అమ్మకం వివాదంపై స్పందించిన పవన్

బోర్డు ఛైర్మన్‌ బాధ్యతలు  స్వీకరించిన తర్వాత దీనిపై తాము సమీక్ష కూడా నిర్వహించామని వైవి తెలిపారు. 1974-2014 మధ్య గత ప్రభుత్వాలు టీటీడీ భూములు అమ్మాయన్నారు. భూముల వేలానికి సంబంధించి రెండు బృందాల్ని ఏర్పాటు చేశామని... వేలం వేయాలంటే ఏం చేయాలి..?, ఎలా ముందుకెళ్లాలి..? అనేది చెప్పమని అడిగామన్నారు.

శ్రీవారి భూముల వేలంపై ధార్మిక పెద్దల్ని, నిపుణుల్ని సలహా కోరతామని వైవీ తెలిపారు. భూముల వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయంపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తమపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి తనకుందని తేల్చిచెప్పారు. 

click me!