అడవిలో 6 కి.మీ.. వీపుపైనే వృద్ధురాలు : కానిస్టేబుల్‌‌పై వైవీ ప్రశంసలు

By Siva KodatiFirst Published Dec 27, 2020, 4:09 PM IST
Highlights

తిరుమల అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకొచ్చిన కానిస్టేబుల్ షేక్ అర్షద్‌ను ప్రశంసించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకొచ్చిన కానిస్టేబుల్ షేక్ అర్షద్‌ను ప్రశంసించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

60 ఏళ్ల మహిళను ఆరు కిలోమీటర్ల దూరం అడవి గుండా తిరుమలకు మోసుకొచ్చావు. భక్తురాలికి నీవు చేసిన సేవ అభినందనీయం. నీ సేవలను గుర్తించాలని డీజీపీకి చెబుతాను' అని వైవీ అన్నారు.

కాగా, వైసీపీ నేత ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఇటీవల చేపట్టిన తిరుమల పాదయాత్ర విధుల్లో స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్ షేక్‌ అర్షద్‌ భద్రతా విధుల్లో ఉన్నారు. ఇదే పాదయాత్రలో నందలూరు మండలానికి చెందిన 60 ఏళ్ల మంగి నాగేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.

గత మంగళవారం అన్నమయ్య కాలిబాట మార్గాన పాదయాత్ర సాగిన సంగతి తెలిసిందే. అంతా అటీవీ మార్గం కావడం, రాళ్లు, రప్పలు వుండటంతో నాగేశ్వరమ్మ కొండ ఎక్కలేక  గుర్రపుపాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది.

నాగేశ్వరమ్మ సంబంధీకులు వున్నప్పటికీ, వారు ఆమెను మోసుకెళ్లే స్థితిలో లేరు. ఆ సమయంలో అప్పటికే చాలా దూరంలో వున్న అర్షద్‌ వెనక్కి వచ్చారు. ఆమెను వీపుపై ఎక్కించుకుని ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు మార్గం వరకూ మోసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక వాహనంలో తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలో చేర్చారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వరకు వెళ్లింది. కానిస్టేబుల్ వివరాలు, సెల్ నంబర్ తెలుసుకున్న ఆయన స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. 
 

click me!