మహాసంప్రోక్షణ వివాదం: జూలై 24న, బోర్డు కీలక భేటీ, టీటీడీ బోర్డు ఏం చేయనుంది?

First Published Jul 17, 2018, 11:49 AM IST
Highlights

 మహాసంప్రోక్షణ కార్యక్రమంపై సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్టు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.


తిరుమల: మహాసంప్రోక్షణ కార్యక్రమంపై సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్టు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.

మహాసంప్రోక్షణ కార్యక్రమంపై వివాదం చోటు చేసుకొన్న నేపథ్యంలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  మంగళవారం నాడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ  ఆదేశాల మేరకు  టీటీడీ  పాలకమండలి  తిరిగి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

మంగళవారం నాడు ఉదయం పూట టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో ఆశోక్ కుమార్ సింఘాల్  మీడియాతో మాట్లాడారు.  మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహణపై  తీసుకోవాల్సిన చర్యలపై  టీటీడీ పాలకవర్గం చర్చించనుంది. ఈ మేరకు 24వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.  

ఈ నిర్ణయం మేరకు   పాలకవర్గం పలు అంశాలపై చర్చించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా  మహాసంప్రోక్షణ కార్యక్రమంపై భక్తుల అభిప్రాయాలను కూడ తీసుకోవాలని టీటీడి భావిస్తోంది. ఈ మేరకు వారం రోజుల పాటు భక్తుల నుండి సలహాలను, సూచలను తీసుకోవాలని భావిస్తున్నారు.

ప్రతి రోజూ  సుమారు 13 వేల మంది భక్తులను శ్రీవారి దర్శనం కోసం అనుమతించే అవకాశం ఉంది. అయితే ఆ సమయంలో విఐపీల తాకిడి ఉంటే ఏం చేయాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.  సుమారు 6 రోజుల పాటు ఆలయం మూసివేస్తే ఇబ్బంది కర పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున మహాసంప్రోక్షణ జరిగే సమయంలో ఆలయం మూసివేయకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని  టీటీడి భావిస్తోంది.

ఆగమ శాస్త్రం ఏం చెబుతోందనే విషయాలను కూడ దృష్టిలో ఉంచుకొని  భక్తుల విశ్వాసాలను దెబ్బతినకుండా చూసేలా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని  టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు  ఇప్పటికే టీటీడీ అనేక వివాదాలను మూటగట్టుకొంది.  ఈ తరుణంలో ఈ నెల 24 వ తేదీన జరిగే పాలకవర్గం సమావేశంలో  కీలక నిర్ణయాలు ఉండే అవకాశం లేకపోలేదు.

click me!