ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. ‘‘నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు!.. నిజం గెలిచింది…. ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!’’ అంటూ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలుగుదేశం శ్రేణుల స్వాగత హర్షధ్వానాల నడుమ ఆయన సభలోకి ప్రవేశించారు. వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలకగా... ప్రత్యేక పూజల అనంతరం చంద్రబాబు శాసనసభలోకి అడుగుపెట్టారు. ముందుగా పవన్ కల్యాణ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ సహా ఎమ్మెల్యేలందరూ ప్లకార్డులు పట్టుకొని... నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభ హోరెత్తింది.
చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో ఆయన శపథం నెరవేరింది. రెండున్నరేళ్ల క్రితం సభలో చేసిన ఉద్వేగపూరిత సవాల్ నెగ్గారు. అయితే, ఈ విజయం వెనుక చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు ఇలా ఎంతో మంది ఉన్నారు. ప్రధానంగా చంద్రబాబు సభలో అవమానించడంతో పాటు అక్రమ కేసులో అరెస్టు చేసి జైలు పంపడం, ఆ తర్వాత పరిణామాలన్నింటిలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనకు వెన్నెముకగా నిలిచారు. ఆయన జైలులో ఉన్నప్పుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి సహా అందరూ బయటకు వచ్చారు. పార్టీ సంక్షోభంలో పడిపోకుండా మేమున్నామంటూ కార్యకర్తలతో కలిసి నడిచారు.
undefined
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ‘‘నిజం గెలవాలి’’ అంటూ నారా భువనేశ్వరి రాష్ట్రమంతా పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మరణించిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. 2023 అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర ప్రారంభించారు. దాదాపు 6నెలలపాటు రాష్ట్రమంతా తిరిగారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి యాత్ర నిర్వహించి... 203 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పద్నాలు విడతల్లో 47 రోజులు పాటు సాగిన నిజం గెలవాలి యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలను కలుస్తూ ముందుకు సాగారు నారా భువనేశ్వరి. వివిధ సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై.. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. మహిళలతో కలిసి మళ్లీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఇలా దాదాపు 150కి పైగా ప్రసంగాలతో టీడీపీ కేడర్‌తో పాటు ప్రజల్లోనూ భువనేశ్వరి చైతన్యం తీసుకొచ్చారు. 9వేల 80 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో 9 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. పలు సభలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. ఒకానొక దశలో చిత్తూరు జిల్లా ‘‘కుప్పంలో చంద్రబాబు స్థానంలో నేను పోటీ చేస్తే ఎలా ఉంటుంది? నన్ను గెలిపించుకుంటారా..?'' అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే.. అవి సరదాగా అన్న మాటలేనని అదే వేదికపై చెప్పారు భువనేశ్వరి...
అలా, చంద్రబాబు గెలుపులో ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా భాగమయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఆయన అడుగుపెట్టిన సందర్భంగా భావోద్వేగ పూరితమైన పోస్టు పెట్టారు. ‘‘నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు!.. నిజం గెలిచింది…. ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!’’ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు!
నిజం గెలిచింది….ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం! pic.twitter.com/mnyuQu5Pt6