వెనక గేటు నుంచి అసెంబ్లీలోకి జగన్ ఎంట్రీ... ఇది కదా స్క్రిప్ట్ అంటే...

By Galam Venkata Rao  |  First Published Jun 21, 2024, 11:52 AM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముందుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఈ క్రమంలో జగన్ అసెంబ్లీలోకి ఎలా వచ్చారో తెలుసా..?


ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి (2024) దారుణంగా ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి 11 సీట్లకే పరిమితమైంది. దాదాపు 40 శాతం ఓటు షేర్‌ సొంతం చేసుకున్నప్పటికీ... 2019లో ప్రతిపక్ష టీడీపీకి వచ్చినన్ని సీట్లు కూడా గెలుచుకోలేకపోవడం గమనార్హం..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కూటమి హవా కొనసాగింది. ఎంతంటే... సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంతం జిల్లాలోనే అధికార పార్టీని చిత్తు చేసే అంత. పులివెందుల, బద్వేలు మినహా కడప జిల్లాలో ఎక్కడా వైసీపీ గెలవలేదు. మిగతా అన్ని స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుచుకున్నారు. అలాగే, ఈసారి జగన్‌కు మెజారిటీ కూడా భారీగా పడిపోయింది. పులివెందులలో 2019లో 90,110 మెజారిటీ నమోదు చేసిన జగన్‌... ఈసారి 61,687 మెజారిటీకి పడిపోయారు. 

Latest Videos

అయితే, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీకి వస్తుందా రాదా అన్న చర్చ చివరి వరకు నడిచింది. తొలిసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పులివెందులలో గెలిచిన వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. 

అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి ప్రవేశించిన విధానం. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి గౌరవంగా అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు... దర్జాగా మెయిన్ గేటులో నుంచి జయజయ హర్షధ్వానాల మధ్య సభలోకి అడుగుపెట్టారు. గత ఐదేళ్లు అసెంబ్లీలో టీడీపీని ఆడుకున్న వైసీపీ మాత్రం దొడ్డిదారిన అసెంబ్లీలోకి రావాల్సి వచ్చింది. వైసీపీ అధినేత జగన్ వెనుక గేటు నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చేవారు. అయితే, ఈసారి అమరావతి రైతులు నిరసన తెలుపుతారని తెలిసి... వేరే రూట్‌లో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సభ ప్రారంభమైనా అయిన జగన్‌... అసెంబ్లీలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకు ప్రాంగణంలో నుంచి లోపలికి వెళ్లి... తన ప్రమాణ స్వీకార సమయంలోనే అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రమాణం చేయడం పూర్తవగానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

 

శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణం, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక నిర్వహించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌, మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆంగ్ల అక్షర క్రమంలో ప్రమాణం చేయగా... సాధారణ ఎమ్మెల్యేలతో పాటే వైసీపీ అధినేత జగన్‌ కూడా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్‌తో ప్రమాణం చేయించారు.

click me!